Chikiri Video Song: పెద్ది ఫస్ట్ సింగిల్ ఫుల్ వీడియో.. చెక్కని శిల్పం లాంటి చికిరి కోసం.. చరణ్ హుక్‌ స్టెప్పులు అదుర్స్

Chikiri Video Song: పెద్ది ఫస్ట్ సింగిల్ ఫుల్ వీడియో.. చెక్కని శిల్పం లాంటి చికిరి కోసం.. చరణ్ హుక్‌ స్టెప్పులు అదుర్స్

ఏడో తరగతి చదువుతున్న బుచ్చిబాబు అనే కుర్రాడు తన కజిన్‌‌ ద్వారా ‘బొంబాయి’ సినిమా పాటలు విని రెహమాన్‌‌కు ఫ్యాన్ అయ్యాడు. పెద్దయ్యాక అతను దర్శకుడై రామ్ చరణ్‌‌తో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు రెహమాన్‌‌ మ్యూజిక్ ఇస్తున్నారు. తన అభిమాన సంగీత దర్శకుడి ఎదురుగా కూర్చుని, తన సినిమాలోని సన్నివేశం గురించి అతను ఇలా వివరిస్తున్నాడు.

‘‘కొండల్లో ఉండే పెద్ది తొలిసారి ఓ పల్లెటూరులో హీరోయిన్‌‌ను చూస్తాడు. కాటుక అవసరం లేని  కళ్లు.. ముక్కుపుడక అక్కర్లేని ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన, అందమైన అమ్మాయి ఈ చికిరి.. అని తన ఫ్రెండ్‌‌కు పాట రూపంలో చెబుతాడు..’’ అని రెహమాన్‌‌కు దర్శకుడు బుచ్చిబాబు పాట సిచుయేషన్‌‌ గురించి చెప్పడం, చికిరి అనే పదం గమ్మత్తుగా ఉందంటూ ఈ హుక్‌‌ వర్డ్‌‌ ఆధారంగానే పాట చేద్దామన్నారు రెహమాన్. కంపోజ్ చేయడమే కాదు.. కంప్లీట్ చేసేశాడు.. ఇప్పుడు ఆ చికిరి శ్రోతల ముందుకు వచ్చేసింది కూడా.  

శుక్రవారం (నవంబర్ 7న) ‘పెద్ది’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌‌ ‘చికిరి చికిరి’ విడుదలైంది. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. చరణ్‌‌ ప్రియురాలు చికిరిగా జాన్వీ కపూర్ ఆకట్టుకుంది. ‘‘చికిరి చికిరి అంటూ సాగిన ఈ పాటలో.. ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే దీనక్క.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా.. అనే పదాలను తనదైన శైలిలో రాసారు బాలాజీ. హుషారైన గొంతుతో మోహిత్ చౌహాన్ పాడారు. రెహమాన్ బాణీకి జానీ కంపోజ్ చేసిన డ్యాన్స్ స్టెప్పులకు.. హీరో చరణ్ ప్రాణం పోశాడు. ఇందులో చరణ్ వేసిన హుక్ స్టెప్స్ భళే క్రేజీగా ఉన్నాయి.

అంతేకాదు.. చరణ్ ఓ ఎత్తైన కొండ ప్రాంతంలో వేసిన స్టేప్పులు చాలా హై రిస్కీ షాట్‪లా కనిపిస్తోన్నాయి. చుట్టూరా లోయ, మరోవైపు ఎండిపోయిన చెట్టు కొమ్మపై చెర్రీ ఓ కాలు, మరో కాలు స్లోప్‌ ఉన్న బండరాయిపై, ఇలా తన బాడీని, తన మనసుని బ్యాలెన్స్‌ చేసుకుంటూ స్టెప్పులు వేశారు చరణ్. ఈ స్టెప్స్ థియేటర్లలో వచ్చినప్పుడు మాత్రం ఆడియన్స్కు గూస్బంప్స్ రావడం పక్కా అనే తెలుస్తోంది. కేవలం చికిరి సాంగ్లోనే.. ఇలాంటి స్టైలిష్ స్టెప్స్ ఉన్నాయంటే.. ఇంకా పెద్ది ఫుల్ ఆల్బమ్ లో ఇంకా ఎలాంటి సాంగ్స్ ఉన్నాయో, ఎలాంటి స్టెప్స్ ఉన్నాయో ఊహించేసుకోవొచ్చు. చాన్నాళ్ల పాటు గుర్తుండిపోయేలా రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారనే విషయం ఈ పాటతో అర్ధమైపోయింది.

స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో.. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ విడుదల కానుంది.