రామ్ చరణ్ ‘పెద్ది’ టీమ్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ట్రోలర్స్‌పై FIR నమోదు!

రామ్ చరణ్ ‘పెద్ది’ టీమ్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ట్రోలర్స్‌పై FIR నమోదు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ  ‘పెద్ది’ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది.  ప్రపంచవ్యాప్తంగా జూన్ 4, 2026న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.  దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై  ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, సినిమా రిలీజ్‌కు ముందే ఇండస్ట్రీలో ఒక రేంజ్ హీట్ క్రియేట్ చేస్తోంది ‘పెద్ది’ టీమ్.

ట్రోలర్స్‌కు చెక్.. 

గత కొన్ని వారాలుగా సోషల్ మీడియా వేదికగా ‘పెద్ది’ సినిమాపై కొందరు కావాలనే టార్గెటెడ్ నెగెటివిటీని ప్రచారం చేస్తున్నట్లు మేకర్స్ గమనించారు. ఆర్గనైజ్డ్ ట్రోలింగ్ కు పాల్పడుతున్న వారిపై చిత్ర యూనిట్ గట్టి యాక్షన్ తీసుకుంది. హైదరాబాద్, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులపై ఇప్పటికే FIRలు నమోదయ్యాయి. మల్టిపుల్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ అకౌంట్ల ద్వారా నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వారిని ఐడెంటిఫై చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవచ్చని కోర్టు సైతం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం..

ప్రీమియర్స్ సందడి.. స్పెషల్ రేట్లు

మరోవైపు ‘పెద్ది’ హంగామా థియేటర్లలో ఒక రోజు ముందే మొదలుకానుంది. జూన్ 3, బుధవారం రాత్రి 8 గంటల నుంచే ఏపీ, తెలంగాణల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్పెషల్ షోలకు జీఎస్టీతో కలిపి ఒక్కో టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించింది.  సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి 10 రోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

సింగిల్ స్క్రీన్స్ లో సాధారణ ధరపై రూ.100 ,  మల్టీప్లెక్స్‌లో టికెట్ ధరపై రూ.125 అదనంగా వసూళ్లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతి లభించింది. అయితే తెలంగాణలో మాత్రం ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం వల్ల టికెట్ రేట్ల పెంపుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

భారీ రన్‌టైమ్.. 

సెన్సార్ బోర్డు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రన్‌టైమ్ సుమారు 3 గంటల 9 నిమిషాలు  ఉన్నట్లు తెలుస్తోంది. లెంగ్త్ ఎక్కువే అయినప్పటికీ, సినిమాలో ఉన్న హై-వోల్టేజ్ డ్రామా, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నెగెటివిటీని దాటుకుని, భారీ అంచనాల మధ్య వస్తున్న ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.