నమ్ముకున్న కళ అవార్డు తెచ్చింది

నమ్ముకున్న కళ అవార్డు తెచ్చింది

కోయ తెగల చరిత్ర, కట్టుబొట్టుని పాటలు పాడుతూ పొల్లుపోకుండా చెప్పగల దిట్ట ఒకరు. మరొకరేమో నాదస్వరంతో మంత్రముగ్ధుల్ని చేసిన విద్వాంసుడు. ఇద్దరూ వారసత్వంగా అబ్బిన కళనే నమ్ముకున్నారు. అదే కళను ఊపిరిగా భావించి, అందరి చేత శెభాష్​ అనిపించుకున్నారు. ఇప్పుడు వాళ్ల కళకి పద్మ అవార్డుల రూపంలో గౌరవం దక్కింది. ఆ ఇద్దరు ఎవరంటే... ఒకరు భద్రాచలం జిల్లాకు చెందిన ఫోక్​ ఆర్టిస్ట్ రామచంద్రయ్య. మరొకరు నాదస్వర విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్న షాన్​వాజ్​ హసన్. ఈయన​కి మరణానంతరం ఈ పురస్కారం దక్కింది. కళనే నమ్ముకుని, ఆ కళతోనే గుర్తింపు తెచ్చుకున్న వీళ్ల గురించి...

సకిని రామచంద్రయ్యది కోయదొర వంశం. సొంతూరు భద్రాచలం జిల్లాలోని మణుగూరు మండలం కూనవరం. ఇతను కంచుతాళం, కంచుమేళం అనే సంగీత వాయిద్యకారుడు. గిరిజనుల ఇలవేల్పుల చరిత్రని ఉయ్యాల పాటలు పాడుతూ  చెప్పడంలో దిట్ట  రామచంద్రయ్య. చదువుకోలేదు. అయితేనేం ఆదివాసీల మూలాలు, సంప్రదాయాలని గడగడ చెప్పేస్తాడు. గిరిజన, వనదేవతల కథల్ని అక్షరం పొల్లు పోకుండా చెప్తాడు  రామచంద్రయ్య. ఆదివాసుల జాతరల్లో, గిరిజనుల పండుగల్లో రామచంద్రయ్య పాట ఉండాల్సిందే. అతని పాట, కంచు మేళం చప్పుడు వింటే చాలు శివసత్తులు పూనకాలతో ఊగిపోతారు. తన పాటతో కంచు తాళం, కంచు మేళానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాడు.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‍గఢ్​ సరిహద్దుల్లోని  ఆదివాసుల  వన దేవతల జాతరల్లో పాటలు పాడతాడు. దాదాపు50 ఏండ్లుగా తన పాటతో, కంచు వాయిద్యంతో ఆదివాసీ చరిత్రని వినిపిస్తున్నాడు రామచంద్రయ్య.

పన్నెండేండ్లకే...
రామచంద్రయ్య 12 ఏండ్ల వయసులోనే కంచు తాళం, కంచు మేళం చేతపట్టాడు. కాళ్లకు గజ్జెలు కట్టుకొని తండ్రి ముసలయ్యతో కలిసి మేడారం జాతరకు వెళ్లెటోడు. రామచంద్రయ్య తాత ముత్తయ్య,  ముత్తాత బావోజీ కూడా కంచు వాయిద్యం వాయిస్తూ పాటలు పాడేవాళ్లు. నాలుగు తరాలుగా ఆదివాసీ సంప్రదాయాల్ని పాటలుగా అందరికీ పరిచయం చేస్తోంది వీళ్ల కుటుంబం. రెండేండ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరలో  రామచంద్రయ్య పాట, కంచు వాయిద్యం స్పెషల్​ అట్రాక్షన్​. జాతర రోజుల్లో సమ్మక్క–సారక్క చరిత్ర, వన దేవతల పుట్టు పూర్వోత్తరాలను ఉయ్యాల పాటల రూపంలో పాడి వినిపిస్తాడు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, ఛత్తీస్‍గఢ్‍లో వనదేవతల చరిత్రని తెలుగు, కోయ భాషల్లో చెప్తున్నాడు ఈయన.  ::మొబగాపు ఆనంద్‍కుమార్​, భద్రాచలం,  నాదస్వర విద్వాంసుడు 


సన్నాయి వాయిద్య కళాకారుడు షేక్​హసన్​ సాహెబ్​1930లో ఆంధ్రప్రదేశ్‍, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గోసవీడులో పుట్టాడు. గుంటూరు జిల్లాలో చిన మౌలానా సాహెబ్‍ దగ్గర సంగీత శిక్షణ తీసుకున్నాడు. కర్ణాటక సంగీతంలో ఆరితేరాడు. ఆకాశవాణి హైదరాబాద్​ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చాడు. భద్రాచలం, యాదగిరిగుట్ట దేవస్థానాల్లో నాదస్వర విద్వాంసుడిగా పనిచేశారు.  భక్తరామదాసు కీర్తనలకు నాదస్వరంతో ప్రాణ ప్రతిష్ఠ  చేశాడు షేక్​ హసన్​. తిరువాయుర్​ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల్లో సంగీత కచేరీలు చేశాడు. ఈ నాదస్వర విద్వాంసుడిని గానకళాసమితి 1962లో స్వర్ణ కంకణం, 2007లో త్యాగరాజ పురస్కారంతో  సత్కరించింది. షేక్​హసన్​ కళానైపుణ్యం తెలుసుకున్న మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు ఆయన్ను ఢిల్లీ పిలిపించుకున్నారు. 2021 జూన్​ 24 న  మరణించాడు. మరణానంతరం పద్మశ్రీ పురస్కారం వచ్చింది. 

రాముడి మీద భక్తితో...
షేక్​ హసన్​ భద్రాచలంలోని రాముడి ఆలయంలో నాదస్వర విద్వాంసుడిగా పనిచేశారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలు రాత్రి పవళింపుసేవ వరకు రాముడి సేవలోనే గడిపారు. రాముడి మీద భక్తితో పెద్ద కుమారుడికి ‘రామ్‍తుల్లా’ అని పేరు పెట్టారు. అతని రెండో కుమారుడు ఖాసీం బాబా భద్రాద్రి రామాలయంలో తాళం విద్వాంసుడు.  

పన్నెండు మెట్ల కిన్నెరతో
కిన్నెర... అరుదైన సంగీత వాయిద్యం. అంతేకాదు అంతరించిపోతున్న కళ కూడా. ఈ అరుదైన కళని తన బతుకులో భాగం చేసుకున్నాడు ఫోక్​ సింగర్​ దర్శనం మొగిలయ్య. కిన్నెరతో ప్రదర్శనలు ఇస్తూ, తన పాటలతో సమాజంలో చైతన్యం తెస్తున్న  మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. కిన్నెరపై లయబద్ధంగా చేతులు ఆడిస్తూ, ఆసువుగా పాటలు పాడడం మొగిలయ్య స్పెషాలిటీ. నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం అవుసలికుంట సొంతూరు. బతుకుతెరువు కోసం కుటుంబంతో సహా హైదరాబాద్​ వచ్చిండు. 
మొగిలయ్య  పూర్వీకులు వనపర్తి దర్బారులో కిన్నెర వాయించేవారట. వాళ్ల వంశంలో ఐదో తరం కిన్నెర వాయిద్యకారుడు ఈయన. పేదరికంలో మగ్గుతున్నా కూడా కిన్నెరని వదిలిపెట్టలేదు మొగిలయ్య.  పన్నెండు మెట్ల కిన్నెర వాయించే వాళ్లలో ఆఖరి కళాకారుడు ఈయనే.  వెదురు, గుండ్రని సొరకాయలు, తేనె, మైనం, తీగలు, ఎద్దుకొమ్ములు, అద్దాలతో చూడముచ్చటగా  ఈ వాయిద్యాన్ని సొంతంగా తయారుచేశాడు. పండుగ సాయన్న కథ, పానుగంటి మీరా సాహెబ్​, వనపర్తి రాజుల కథల్ని, జానపదాల్ని కిన్నెర వాయిస్తూ,  పాడి వినిపిస్తాడు.  ఈమధ్యే అతనికి సినిమా ఛాన్స్​లు కూడా వస్తున్నాయి. ‘భీమ్లా నాయక్​’ సినిమా టైటిల్​ సాంగ్, ఆర్టీసీ బస్సు సర్వీస్​ మీద మొగిలయ్య పాడిన పాటలు సూపర్​ హిట్​ అయ్యాయి.