గాడితప్పిన బల్దియా..సెలవులో కమిషనర్, ఆఫీసర్లు

గాడితప్పిన బల్దియా..సెలవులో కమిషనర్, ఆఫీసర్లు
  • జీతాల కోసం ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగుల పడిగాపులు
  • వివిధ సర్టిఫికెట్లకు తప్పని తిప్పలు
  • రామగుండం కార్పొరేషన్​ లో  అస్తవ్యస్త పాలన

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌‌ పాలన గాడి తప్పింది. ఆఫీసర్లపై పాలకవర్గానికి పట్టులేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నదనే ప్రచారం జరుగుతోంది. 572 మంది ఔట్ సోర్సింగ్‌‌ ఉద్యోగుల జీతాల ఫైల్‌‌పై సంతకం చేయాల్సిన కమిషనర్ అనారోగ్యం కారణం చూపుతూ ఈ నెల 14వరకు సెలవు పెట్టారు. మరికొందరు ముఖ్య ఆఫీసర్లు కూడా సెలవులో ఉన్నారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ కార్పొరేటర్లలో రెండు గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. దీనికితోడు గతంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందనే ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్‌‌ విచారణ జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ రామగుండం బల్దియాలో అయోమయానికి గురిచేస్తున్నాయి. 

విజిలెన్స్‌‌ ఎఫెక్టేనా...?

రామగుండం కార్పొరేషన్‌‌లో గతంలో వెహికల్స్‌‌ కొనుగోలుకు డబ్బులు చెల్లించినప్పటికీ అవి ఏడాది తర్వాత ఆఫీస్‌‌కు చేరడంపై  విజిలెన్స్‌‌కు కాంగ్రెస్‌‌ కార్పొరేటర్ కొలిపాక సుజాత ఫిర్యాదు చేయడంతో విచారణ కొనసాగుతున్నది. తాజాగా 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు, పట్టణ ప్రగతి స్కీమ్‌‌కు చెందిన నిధులతో కార్పొరేషన్‌‌ పరిధిలోని 4, 5, 12, 15, 17, 18, 22, 33, 35, 49 డివిజన్లలో నిర్మించిన సీసీ రోడ్లు, అండర్‌‌ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించిన వివరాలను తెలపాలని కార్పొరేషన్‌‌కు విజిలెన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ తాజాగా లేఖ రాసింది. ఆయా పనులకు సంబంధించి డిటైల్డ్‌‌ ప్రాజెక్ట్‌‌ రిపోర్ట్‌‌, అడ్మినిస్ట్రేషన్‌‌ శాంక్షన్‌‌, టెక్నికల్‌‌ శాంక్షన్, తదితర వివరాలను ఇవ్వాలని, అలాగే ఈ పనుల్లో ఏఈ నుంచి మొదలుకొని కమిషనర్‌‌ వరకు  ఏయే బాధ్యతలను నిర్వర్తించారనే వివరాలను తెలపాలని ఆ లేఖలో కోరారు.

ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన ఆఫీసర్లు ఈ తలనొప్పి తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తూ సెలవులో వెళుతున్నట్టు స్పష్టమవుతున్నది. గతంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌‌ విచారణకు అటెండ్‌‌ అవుతున్న ఇంజినీరింగ్‌‌ డీఈ సెలవు పెట్టారు. రవికుమార్‌‌ అనే డీఈ కొత్తగూడం టౌన్​కు బదిలీ అయ్యారు. కమిషనర్‌‌ సుమన్‌‌ రావు అనారోగ్య కారణం చూపుతూ ఈ నెల 14  వరకు సెలవు పెట్టారు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌‌ విభాగానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. కాగా కమిషనర్‌‌ సెలవులో ఉన్నప్పటికీ ఇన్​చార్జి బాధ్యతలు ఎవరికి ఇవ్వకపోవడంతో 572 మంది ఔట్ సోర్సింగ్‌‌ ఉద్యోగులకు సంబంధించిన జీతాల ఫైల్‌‌పై సంతకం చేసే వారే లేకుండా పోయారు. ఈ నెలలో జీతాలు రాకపోతే వారు కార్పొరేషన్‌‌ ఆఫీస్‌‌ ముందు బైఠాయించి ఆందోళన చేసేందుకు సిద్దమవుతున్నారు. అలాగే కమిషనర్‌‌ డిజిటల్‌‌ సంతకం కావాల్సిన బర్త్‌‌, డెత్‌‌, ఇతర సర్టిఫికెట్ల క్లియరెన్స్‌‌కు, ట్రేడ్‌‌ లైసెన్స్‌‌ల జారీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.   

ఆఫీసర్లపై పట్టు సాధించని పాలకవర్గం...

పాలకవర్గం ఏర్పడి మూడున్నర సంవత్సరాలైనా ఇక్కడి ఆఫీసర్లపై పట్టు సాధించలేకపోయింది. మేయర్‌‌గా వ్యవహరిస్తున్న అనిల్‌‌ కుమార్‌‌ స్వతహాగా డాక్టర్‌‌ కావడంతో ఆయన ఆ వృత్తిపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ బల్దియా వ్యవహారాలపై పట్టింపు లేకుండా ఉన్నారు. దీనికితోడు కార్పొరేషన్‌‌లో మేయర్‌‌, డిప్యూటీ మేయర్‌‌ వర్గాలుగా అధికార పార్టీ కార్పొరేటర్లు విడిపోయారు. గతంలో యాదగిరి అనే డీఈ అధికారిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఒకరు, వద్దని మరొకరు సంతకాల సేకరణ కూడా చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా  బీఆర్‌‌ఎస్‌‌ పార్టీలో 11 మంది కార్పొరేటర్లు 'ప్రత్యేక ఫోరమ్‌‌'గా ఏర్పాటై వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌‌ఎస్‌‌ కార్పొరేటర్లలో విభేదాలు లేవని, అందరం ఒక్కటే అని మేయర్‌‌ సమక్షంలో డిప్యూటీ మేయర్‌‌ అభిషేక్‌‌ రావు ప్రకటించినప్పటికీ ఆ 11 మంది ఫోరమ్‌‌ కార్పొరేటర్లు సపరేట్‌‌గా ప్రోగ్రామ్‌‌లు చేస్తుండడం వారి మధ్య సఖ్యత లేదనే సంకేతాన్ని తెలుపుతున్నది. ఈ ఫోరమ్‌‌ కార్పొరేటర్లకు మేయర్‌‌ పరోక్షంగా సపోర్ట్‌‌ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. 

ఇదిలా ఉండగా బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ డివిజన్లలో కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆఫీసర్లపై కార్పొరేటర్లు ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా తమ ఉద్యోగాలకు ఎసరు వచ్చే అవకాశాలున్నాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. దీంతో వారు ఎవరి మాట వినకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారనేది సుస్పష్టంగా కనిపిస్తున్నది. అయితే దీని ప్రభావం కార్పొరేషన్‌‌పై పడుతున్నందున బల్దియా పాలన సక్రమంగా జరిగేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడి ప్రజలు 
కోరుతున్నారు.