రామలింగారెడ్డి కుటుంబానికే దుబ్బాక టికెట్.!

రామలింగారెడ్డి కుటుంబానికే దుబ్బాక టికెట్.!

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక సెగ్మెంట్ టికెట్ ను ఆ కుటుంబానికే ఇవ్వాలని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. రామలింగారెడ్డి కుమారుడు సతీశ్రెడ్డి పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో సతీశ్రెడ్డి చురుకుగా ఉంటున్నారని, పంచాయతీ ఎన్నికల్లోయాక్టివ్ గా పనిచేశారని చెప్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రామలింగారెడ్డి మూడు రోజుల కింద మరణించిన విషయం తెలిసిందే. దీంతో దుబ్బాక ఎమ్మెల్యే సీటు ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రెటరీ గెజిట్ కూడా విడుదల చేశారు. ఈ మేరకు ఆరు నెలల్లోపు
ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన ఈ సీటును తిరిగి ఆ కుటుంబానికి ఇవ్వడం న్యాయమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రామలింగారెడ్డి కుమారుడికి టికెట్ ఇచ్చే ఆలోచన ఉందని, పెద్ద కర్మ తర్వాత ప్రకటించే చాన్స్ ఉందని అంటున్నాయి. కొందరు పార్టీ నేతలు దుబ్బాక టికెట్ పై ఆశపడుతున్నా.. అది సరికాదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడుతున్నారని ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అంటున్నారు.