
ముషీరాబాద్,వెలుగు: దేశంలోని అన్నిరంగాల్లో 100 శాతం పారదర్శకత అవసరమని, అందుకు బాధ్యతగా వ్యవహరించినప్పుడే పరిపాలన బాగుంటుందని హైకోర్టు జస్టిస్ ఎ. రామలింగేశ్వర రావు పేర్కొన్నారు. కాకా బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో కేంద్రీకృత పాలన – పారదర్శకత ఆవశ్యకత సవాళ్లు – సంస్కరణలు వ్యూహాలు’ అంశంపై మూడ్రోజులపాటు జరిగిన అంతర్జాతీయ సెమినార్ శుక్రవారం ముగిసింది.
హైకోర్టు జస్టిస్ రామలింగేశ్వర రావు, ఓయూ లా డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ హేమలత దేవి హాజరై మాట్లాడారు. పౌరుడు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మాత్రమే పరిపాలనలో పారదర్శకత సాధ్యమవుతుందన్నారు. ఇందుకు లా స్టూడెంట్లు ప్రధాన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సెమినార్లో వివిధ దేశాల్లోని యూనివర్సిటీల స్టూడెంట్లు, ఫ్యాకల్టీ, ప్రొఫెసర్లతో పాటు కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ స్టూడెంట్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.