అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఎగవేసిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ నవంబర్ 21న నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తక్కువగా వసూలవుతుండడంతో బల్దియా అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.. ఇందులో భాగంగా దగ్గుపాటి సురేశ్బాబుకి చెందిన రామానాయుడు స్టూడియో, సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ ట్రేడ్ లైసెన్స్ వివరాలు పరిశీలించారు. పరీశలనలో తక్కువ ఫీజు చెల్లిస్తున్నట్లు గుర్తించారు.
పన్ను చెల్లింపుల్లో పూర్తి నిబద్ధత
అయితే దీనిపై రామానాయుడు స్టూడియోస్ (సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్) వివరణ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులకు సంబంధించి ఇటీవల వస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాము జీహెచ్‌ఎంసీ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
జీహెచ్‌ఎంసీ జారీ చేసే డిమాండ్ నోటీసుల మేరకు తాము ప్రతి సంవత్సరం ట్రేడ్ లైసెన్స్ ఫీజును క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాము. ఆస్తి పన్ను (Property Tax) ట్రేడ్ లైసెన్స్ ఫీజు విధించే విషయంలో జీహెచ్‌ఎంసీనే సమర్థవంతమైన అధికార సంస్థగా గుర్తిస్తున్నామని, అన్ని చట్టపరమైన అంశాలలో జీహెచ్‌ఎంసీ అధికారులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సంస్థ తెలిపింది. చాలా సంవత్సరాలుగా.. జీహెచ్‌ఎంసీ రికార్డుల ప్రకారం, తమ ఆస్తి పన్నును 68,276 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా ఆధారంగా నిరంతరం అంచనా వేసి చెల్లిస్తున్నామని స్టూడియో స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎప్పుడూ ఎలాంటి దాచిపెట్టడం, తప్పుడు నివేదిక ఇవ్వడం జరగలేదని వెల్లడించింది..
ఒక్కసారిగా పెరిగిన ఫీజు..
ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ తమ ట్రేడ్ లైసెన్స్ ఫీజును భారీగా సవరించింది. గతంలో సంవత్సరానికి రూ. 7,614 ఉన్న ఫీజును అమాంతం రూ. 2,73,104 కి పెంచింది. ఈ పెరిగిన మొత్తాన్ని కూడా రామానాయుడు స్టూడియోస్ యథావిధిగా చెల్లించింది. అయితే, ఇంత భారీ పెరుగుదలను తట్టుకోవడం కష్టమని, న్యాయబద్ధత, స్థిరత్వం కోసం ఈ మొత్తాన్ని హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని స్టూడియో విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ సానుకూలంగా స్పందిస్తుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపింది.
వదంతులు అవాస్తవం..
"బిల్ట్-అప్ ఏరియాకు సంబంధించి ఎలాంటి దాపరికమూ లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ కూడా లేదు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవం, వాస్తవాలకు అదారం లేనివి. రామానాయుడు స్టూడియోస్ అన్ని జీహెచ్‌ఎంసీ నిబంధనలను పూర్తిగా పాటిస్తుంది. అధికారులతో పూర్తి పారదర్శకతను కొనసాగిస్తుంది అని సంస్థ ప్రెస్ నోట్‌లో స్పష్టం చేసింది. టాలీవుడ్‌లో అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రాలలో ఒకటిగా ఉన్న రామానాయుడు స్టూడియోస్.. తమ వ్యాపార నిర్వహణలో చట్టపరమైన, నైతిక విలువల పట్ల నిబద్ధతతో ఉన్నామని తెలిపింది..
►ALOS READ | Ram Gopal Varma: 'రాబిన్ హుడ్ రవి' హీరో కాదు.. పైరసీ వ్యూయర్సే అసలు నేరస్తులు!
