రేపట్నుంచి రామానుజాచార్యుల వెయ్యేండ్ల పండుగ

రేపట్నుంచి రామానుజాచార్యుల వెయ్యేండ్ల పండుగ
  • కరోనా ప్రభావం తగ్గించేందుకు 1,035 కుండాలతో మహా యజ్ఞం: చిన జీయర్‌‌ స్వామి
  • 5న ప్రధాని మోడీ చేతుల మీదుగా ‘స్టాచ్యూ ఆఫ్‌‌ ఈక్వాలిటీ’ జాతికి అంకితం
  • 12న రామానుజుల బంగారు విగ్రహం ఆవిష్కరించనున్న రాష్ట్రపతి

హైదరాబాద్‌‌, వెలుగు: సమాజాన్ని మేల్కొలిపిన రామానుజాచార్యుల వెయ్యేండ్ల పండుగను ఈ నెల 2వ తేదీ నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త  త్రిదండి చిన జీయర్ స్వామి చెప్పారు. రామానుజాచార్యులు ఇచ్చిన సమతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకే 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా ప్రభావాన్ని తగ్గించడానికి 1,035 కుండాలతో మహా యజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌‌ ముచ్చింతల్‌‌లోని తన ఆశ్రమంలో జీయర్‌‌ స్వామి మీడియాతో మాట్లాడారు. రెండో తేదీ నుంచి ముచ్చింతల్‌‌లో రామానుజుల సహస్రాబ్ది వేడుకను ప్రారంభిస్తామన్నారు. స్టాచ్యూ ఆఫ్‌‌ ఈక్వాలిటీ పేరుతో నిర్మించిన రామానుజాచార్యుల విగ్రహాన్ని 5వ తేదీన జాతికి ప్రధాని నరేంద్ర మోడీ అంకితం చేస్తారని చెప్పారు.
12న 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభిస్తారని తెలిపారు. దేశ చరిత్రలో బంగారు ఇతిహాసాన్ని రచించిన మహానుభావులు రామానుజాచార్యులని చెప్పారు. సమతా స్ఫూర్తికి ఆకారం రామానుజాచార్యులని, వెయ్యేళ్ల క్రితమే సమానత్వాన్ని బోధించారన్నారు. మానవ సేవే మాధవసేవ కాదని, సర్వప్రాణి సేవ చేయాలని చెప్పారని గుర్తుచేశారు. 
అసమానత..అతి భయంకరమైన వైరస్
సమాజాన్ని పట్టిపీడిస్తున్న భయంకరమైన వైరస్‌ ‘అసమానత’ అని, దాన్ని పొగొట్టేందుకే ప్రయత్నిస్తున్నామని జీయర్‌ స్వామి చెప్పారు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని గౌరవించలేకపోతున్నారని, కులాల మధ్య సమానత్వం కొరవడిందని, కులం అనే హద్దులు దాటాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మనుషులపై ఆధిపత్యం ప్రదర్శించే స్థితిని ప్రస్తుతం చూస్తున్నామన్నారు. అహంకారం అనే జబ్బు పెరిగిపోతోందన్నారు. బయట వచ్చే రోగాలకే కాదు, మనసులోని జబ్బులకు కూడా వ్యాక్సిన్‌ కనుక్కోవాలన్నారు. మనిషిలోని అహంకారానికి వ్యాక్సిన్‌ను రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే కనిపెట్టారన్నారు. సమతా స్పూర్తే మనిషిలోని అహంకారాన్ని తుదముట్టిస్తుందన్నారు. మన దేశం, ధర్మం, సంస్కృతిపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రామానుజ చరిత్రను థియేటర్‌లో భక్తులకు ప్రదర్శిస్తామని, సమతా మూర్తి కేంద్రంలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఒకే చోట 108 దివ్యక్షేత్రాలు 
ఇక్కడ ప్రతి నిర్మాణం 9తో ముడిపడి ఉంటుందని చెప్పారు. ప్రాంగణంలో 108 దివ్య క్షేత్రాలను నిర్మించామని, ఒక్కరోజులోనే వీటన్నింటిని చూసే అదృష్టం కలుగుతుందన్నారు. వాటిలో తిరుపతి, అహోబిలం, పాలసముద్రం, వైకుంఠం ఉన్నాయన్నారు. సమాతామూర్తి విగ్రహం దిగువన 108 మెట్లు నిర్మించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ విద్యా విధానం మంచి మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్నారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో మహానీయుల గొప్పతనం గురించి తెలుసుకొంటున్నామని, ఇది గొప్ప కార్యక్రమమని ప్రశంసించారు. ఇందులో భాగంగానే రామానుజచార్యుల వెయ్యేళ్ల పండుగ వచ్చిందని భావిస్తున్నామన్నారు.