వందే రామానుజం

వందే రామానుజం

ఆయనో యోగి. విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన తత్వవేత్త. సామాన్యులందరికీ తిరుమంత్రాన్ని పంచిన ఆస్తిక హేతువాది. యోగి మాత్రమే కాదు.. యోగులకే గురువు. ‘దేవుడిని పూజించటం. మోక్షాన్ని సాధించటం...  మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు’ అని చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త. ఆయనే రామానుజాచార్యులు. వెయ్యేండ్ల క్రితమే అంతగా ఆలోచించిన ఆ మహనీయుడి గురించి తెలిసింది చాలా కొద్దిమందికి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే త్రిదండి చిన జీయర్ స్వామి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. దానికి ప్రతిరూపమే ఇక్కడ కనిపిస్తున్న 216 అడుగుల సమతామూర్తి. 

సమానత్వాన్ని చాటిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకే  స్టాచ్యూ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఈక్విటీ(సమతా విగ్రహం)ని ఏర్పాటు చేశారు. 216 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన ఇక్కడ భారీ విగ్రహంతోపాటు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలు ఉన్నాయి. రామానుజాచార్య విగ్రహంతో పాటు ఇక్కడ108 ఆలయాలు కూడా ఉన్నాయి. ఇది భువి మీద కనిపిస్తున్న అద్భుతం అని చెప్పొచ్చు. ఈ అద్భుతం చూడాలంటే హైదరాబాద్​లోని శంషాబాద్ ముచ్చింతల్‌‌‌‌‌‌‌‌ దగ్గర్లోని శ్రీరామనగరానికి వెళ్లాలి. ఆలోచన రావడమే తరువాయి ప్రాజెక్టు మొదలైపోలేదు. అందుకు ఎంతో ప్లానింగ్​ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఈ ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన పనులు 2016లో మొదలయ్యాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు ఇప్పటికి పూర్తయ్యాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులతో 2,700 మంది శిల్పులు పనిచేసి ఈ అద్భుతాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరించారు. అదంతా సరే కానీ... ఇంత ఖర్చు చేసి రామానుజాచార్య విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారో తెలుసా? ఎందుకంటే... వేల ఏండ్ల క్రితమే మనుషుల్లో సమతాస్ఫూర్తిని నింపిన మానవతావాది. భూమ్మీద పుట్టిన ప్రతి జీవి సమానమే అని చాటి  చెప్పిన మహానుభావుడు. ఆయన గురించి భావితరాలు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అలాగే రామానుజాచార్యుడి బాటలో ముందుతరాలు నడవాలనే ఉద్దేశంతోనే చినజీయర్ స్వామి ఇంతటి మహాకార్యాన్ని భుజాన ఎత్తుకున్నారు. 
 

రామానుజుడి పుట్టుక
రామానుజాచార్యుల పేరు చాలామంది వినే ఉంటారు. అలాగే ఆయన చెప్పిన విషయాలు  పండితులు ఇప్పటికీ చెప్తుంటారు. కానీ.. ఆయన జీవితం గురించి మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. క్రీస్తు శకం1017(కలియుగ సంవత్సరం 4118 )లో శ్రీపెరంబుదూరులో జన్మించారు రామానుజులు. ఇది చెన్నై సిటీకి పాతిక కిలో మీటర్ల దూరంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు కాంతిమతీ దేవి, కేశవ సోమయాజులకు ముందుగా ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారు. మగపిల్లవాడు కావాలని వాళ్ల ఊరికి దగ్గర్లోని పార్థసారధి ఆలయానికి వెళ్లి పుత్ర కామేష్టి యాగం చేశారు. ఈ ఆలయం ఇప్పుడు చెన్నయ్​లో ట్రిపిల్​కేన్​ అనే ప్రాంతంలో ఉంది. ఇప్పటికీ ఈ ఆలయానికి చాలా శక్తివంతమైనదని పేరుంది. ఇది దేశంలోని 108 దివ్యక్షేత్రాల్లో ఒకటి. కేశవ సోమయాజులు ఈ ఆలయంలో 40 రోజులు పుత్రకామేష్టి యాగం చేశారు. అది పూర్తయ్యాక కాంతిమతీ దేవి నిద్రలో ఉన్నప్పుడు ఆమె కలలో నారాయణుడు కనిపించి ‘‘అమ్మా! యాగం చాలా శ్రద్ధగా చేశారు. నీ కోరిక ఏంటి చెప్పు?’’ అని అడిగాడు. అప్పుడామె ‘‘నాకు నీ అంతటి గొప్ప కొడుకు పుట్టాలి”అని కోరుకుంది. అది విన్న నారాయణుడు నవ్వి... ‘‘నా అంతటి వాడు పుట్టాలంటే... నేనే పుట్టాలి. సరే! ధర్మ సంస్థాపన చేయడానికి నీ కడుపులో నా అంతటి గొప్పవాడు తప్పక పుడతాడు’’ అని ఆశీర్వదించాడు. తర్వాత కాంతిమతి గర్భం దాల్చి, వైశాఖ పంచమి నాడు రామానుజాచార్యులకు జన్మనిచ్చింది. ఆయన మొత్తం ఏడు అంశలతో జన్మించారని చెప్పుకుంటారు. ఆయన పుట్టగానే ఆకాశవాణి ‘ధీ లబ్ధః’ అని గట్టిగా మూడు సార్లు పలికిందట. అంటే ‘మహనీయుడు లభించాడు’ అని అర్థం. 
 

పేరు వచ్చిందిలా... 
రామానుజాచార్యులకు తిరుమల నంబి అని మేనమామ ఉండేవాడు. ఆయన వెంకటేశ్వరస్వామిని ప్రసన్నం చేసుకున్న మహాభక్తుడు. తిరుమలలో చెక్క వంతెన మీద నుంచి ఆలయంలోకి వెళ్తుంటే కింద కనిపించేది తిరుమల నంబి ఆలయమే. ఆయన బిడ్డను చూసి ‘‘ముఖం వర్చస్సుతో వెలిగిపోతోంది. సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చినట్టు అనిపిస్తోంది. ఈ తేజస్సు చూస్తుంటే రామాయణంలో లక్ష్మణుడు గుర్తుకొస్తున్నాడు” అని చెప్పి రామానుజుడు అని పేరు పెట్టాడు. 
 

కైవల్యం కోసం.. 
చిన్నతనం నుంచి రామానుజుల వారికి గురువును వెతుక్కోవాలి. కైవల్యం పొందే మార్గాన్ని తెలుసుకోవాలి అనే తపన ఉండేది. కైవల్యం గురించిన ఆలోచనలు ఎందుకంటే... ఆయన మానవావతారంలో ఉన్నా... పుట్టింది ఆదిశేషుడి అంశతో కాబట్టి. ఆదిశేషుడు వైకుంఠ వాసి కదా! అందుకే అక్కడికే వెళ్లిపోవాలి అనుకున్నారు. అందుకేకాబోలు రామానుజాచార్యులు కైవల్యం కోసం అంత ఆరాటపడ్డారు. దాంతో వాళ్ల నాన్న చిన్నప్పుడే ఉపనయనం చేసి ఊళ్లో ఉన్న గురువుల వద్దకు పంపించాడు. విద్వత్తు అపారంగా ఉండటంతో పదేండ్లలో నేర్చుకోవాల్సింది పది రోజుల్లో నేర్చేసుకుని, ఇంకా నేర్పించమని అడిగారు. దాంతో ఆ గురువులు ‘‘నీకు చదువు చెప్పడం మా తరం కాదు” అని చెప్పి మరో గురువు దగ్గరకి పంపించారు. ఆ గురువు దగ్గర కూడా నెల రోజుల్లో అంతా నేర్చుకున్నారు. అలా గురువులందరి దగ్గర అన్ని విద్యలు, శాస్ర్తాలు, వేదాలు చిన్నతనంలోనే నేర్చేసుకుని మహాజ్ఞాని అయ్యారు. అప్పటినుంచి కైవల్య మార్గం చెప్పే గురువు కావాలని వెతకడం మొదలుపెట్టారు. అది చూసిన తండ్రికి భయమేసి, ఇలానే ఉంటే సన్యాసిగా మారిపోతాడేమో అని రామానుజుల వారికి పెండ్లి చేయాలి అనుకుని, పదమూడేండ్లకే పెళ్లి చేసేశాడు. పెళ్లయిన తర్వాత మూడేండ్లకే తండ్రి సోమయాజులు చనిపోయాడు. తల్లి, ఇద్దరు తోబుట్టువులు, భార్యను పోషించాల్సిన బాధ్యత ఆయన మీద పడింది. 

గురువుకే గురువు
పదహారేండ్ల వయసులో ఒకవైపు కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతూనే మరోవైపు గురువు కోసం అన్వేషణ సాగించారు. ఆఖరికి కాంచీపురానికి పది కిలోమీటర్ల దూరంలో తిరుప్పుట్​కులిలో పెద్ద గురువు ఉన్నాడని తెలుసుకున్నారు. ఆయన పేరు యాదవ ప్రకాశులు. ఆయన అద్వైత సంప్రదాయ గురువు. అద్వైతం అంటే శంకరాచార్య సంప్రదాయం. ఆయన దగ్గరకెళ్లి విద్య నేర్చుకోవాలని కుటుంబం మొత్తాన్ని తీసుకుని తిరుప్పుట్​కులికి వెళ్లిపోయారు. ఆ ఊళ్లో విజయ రాఘవ పెరుమాళ్లు అనే విష్ణుమూర్తి ఆలయం ఉంది. అక్కడే స్వామి జఠాయువుకి మోక్షం ఇచ్చారని చెప్తుంటారు. అక్కడ విష్ణుమూర్తి చేతిలో ఒక పక్షి ఉంటుంది. ఆ ఆలయంలోని మంటపంలోనే యాదవ ప్రకాశులు, రామానుజులుకు విద్య నేర్పారు. ఆ మండపం ఇప్పటికీ ఉంది. యాదవ ప్రకాశుల దగ్గర కూడా కొంతకాలానికే మొత్తం విద్య నేర్చుకున్నారాయన.  అప్పటినుంచి రామానుజులు అడిగిన ప్రశ్నలకు ప్రకాశులు సమాధానాలు చెప్పలేకపోయారు. దాంతో కోపం వచ్చి ‘‘రామానుజులు నా కన్న గొప్పవాడా? ఆ ప్రశ్నలు అడగడం ఏంటి?” అనుకున్నారు. ఒకసారి రామానుజాచార్యులని పిలిచి ‘నాయనా, నా వళ్లు పట్టు కాస్త’ అని అడిగారు. సరే అని ఒళ్లు పడుతూ ‘స్వామీ.. వేదంలోనివి లేదా ఉపనిషత్తులోనివి ఏమైనా బోధించండి’ అని అడిగాడు. అప్పుడు గురువు ఛాందోగ్య ఉపనిషత్‌‌లోని మంత్రాలు, వాటి అర్థం వివరించాడు. ‘‘తస్త్య యథా కప్యాసం పుండరీకమేవ అక్షితే...’’ నారాయణుడి కళ్లు పుండరీకం.. అంటే తామరపూలలా ఉన్నాయి. ఆ తామర పూలు కోతి పృష్టభాగం ఉన్నట్టు ఎర్రగా ఉన్నాయని అర్థం” అని చెప్పాడు. అది విన్న రామానుజుల కళ్ల వెంబడి నీళ్లు కారి, ఆ నీళ్లు గురువు భుజాల మీద పడ్డాయి. దాంతో వెనక్కి తిరిగి చూసి ‘ఎందుకు బాధపడుతున్నావు’ అని అడిగాడు గురువు. ‘‘అంతటి నారాయణుడి కళ్లను కోతి పృష్టభాగంతో పోలుస్తారా?’’ అని రామానుజులు దానికి మరో చక్కని అర్థం చెప్పారు. ‘కపి’ అనే పదానికి కోతి అనే కాదు.. ‘తామర తూడు, సూర్యుడు’ అనే అర్థం కూడా ఉంది. అలా తీసుకుంటే సూర్యకాంతితో వికసించిన పద్మం తామర తూడుపైన నిలబడి ఉందనే అర్థం వస్తుందని చెప్పారు. దాంతో అక్కడున్న శిష్యులంతా రామానుజుల తెలివిని మెచ్చుకుంటారు. అలా గురువులకే గురువుగా పేరు తెచ్చుకున్నారు రామానుజాచార్యులు. 
 

హత్యా ప్రయత్నం
ప్రకాశకులతో వాదోపవాదాల్లో ఎప్పుడూ రామానుజాచార్యులే గెలిచేవారు. దాంతో ఈర్ష్య పెంచుకున్న ప్రకాశకులు రామానుజులుని చంపేందుకు పన్నాగం పన్నారు. కానీ.. ఆ విషయం తెలుసుకున్న రామానుజులు తప్పించుకోగలిగారు. కొన్ని రోజుల తర్వాత రామానుజుల వాదనలను అంగీకరించలేని ప్రకాశకులు అతడిని శిష్యగణం నుంచి తొలగించారు. దాంతో ఆయన అక్కడి నుంచి యమునాచార్యులు అనే గురువు దగ్గర చేరాలని శ్రీ రంగం వెళ్లారు. కానీ.. ఈయన వెళ్లేలోపే ఆయన చనిపోయారు. అప్పటినుంచి రామానుజులు అక్కడే ఉన్నారు. 
 

తిరుమంత్రం
యమునాచార్యుల శిష్యుల్లో ఒకరైన పేరాయనంబి రామానుజులకి ఒక సలహా ఇచ్చాడు. తిరుక్కొట్టియూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోష్టీపూర్ణులు  అనే గొప్ప పండితుడున్నాడు. ఆయన దగ్గర తిరు మంత్రం, చరమశ్లోకం తెలుసుకోవాలని సూచించాడు. దాంతో గోష్టీపూర్ణుల దగ్గరకు వెళ్లి వాటిని నేర్పమని అడిగారు. అప్పుడాయన ‘‘ఆ మంత్రోపదేశానికి కొన్ని అర్హతలు ఉండాలి. అవి నీలో ఉన్నాయో లేదో చూసి అప్పుడు చెప్తా’’ అన్నాడు. తర్వాత ఆయన పెట్టిన పరీక్షల్లో నెగ్గి, మంత్రోపదేశం చేయించుకుంటారు. కానీ.. ఆ మంత్రాన్ని ఎప్పుడూ బయటికి చెప్పొద్దని ఆజ్ఞాపించాడు గోష్టీపూర్ణులు.  కానీ.. ఆయన మనసులో ‘‘నేను ఈ మంత్రాన్ని పొందడానికి ఎంతోకాలం ఎదురుచూశాను. దాన్ని సామాన్యులందరికీ చెప్తే వాళ్లందరికీ మేలు కలుగుతుంది” అనుకున్నారు. దాంతో తిరుమంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురంపైకి ఎక్కి అందరికీ వినిపించేలా గట్టిగా చెప్పారు. వెంటనే గోష్టీపూర్ణులు అక్కడికొచ్చి ఈ మంత్రం బయటికి చెప్తే నరకానికి వెళ్తావని చెప్పాడు. అప్పుడు ‘‘నేను నరకానికి వెళ్లినా పర్వాలేదు. ఈ మంత్రం విన్న వాళ్లకు ముక్తి దొరికితే చాలు. కొన్ని వేలమంది సంతోషం కోసం నేను బాధపడ్డా పర్వాలేదు” అని అన్నారు రామానుజులు. 
 

కులం కంటే గుణమే ముఖ్యం 
కులం కంటే గుణమే ముఖ్యమని చెప్పిన గొప్ప వ్యక్తి రామానుజులు. రంగనాథ స్వామి వారికి ధరింపచేసిన ధోవతులను ఒక చాకలి ప్రతిరోజూ ఉతికి తెచ్చేవాడు. రామానుజులు అతని సేవ, భక్తి భావాన్ని గమనించి, స్వామి సేవకు తనతోపాటు అతడిని కూడా గర్భాలయంలోకి తీసుకెళ్లారు. ఇలా చాలాసార్లు అందరూ సమానమే అని చాటి చెప్పారు రామానుజులు. అందుకే ఆయనని సత్వగుణ సంపన్నులు, కరుణాసముద్రులు, పరుల దుఃఖాన్ని దయతో పోగొట్టేవాడు అనేవాళ్లు. 
 

విశిష్టాద్వైతం 
రామానుజులు విశిష్టాద్వైతాన్ని బలంగా ప్రతిపాదించారు. అంతేకాదు అనేక ప్రాంతాలు తిరిగి ఎన్నో ఆలయాల్లో మూర్తులను విష్ణు సంబంధమైన విగ్రహాలుగా నిరూపించారు. ఎన్నో ఆలయాలకు ఆగమ విధానాలు ఏర్పాటు చేయించారు. విశిష్టాద్వైతాన్ని ఊరూరా ప్రచారం చేశారు. అంటరానితనాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించారు. స్ర్తీలను భగవతారాధనకు దగ్గర చేశారు.  బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం గ్రంథాలను రచించారు. చివరగా 1137వ సంవత్సరం మాఘ శుద్ధ దశమి శనివారం రోజున120 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. 
 

శరీరం నేటికీ... 
రామానుజాచార్యులు చనిపోయి వెయ్యేండ్లు గడుస్తున్నా ఆయన శరీరం ఇప్పటికీ భద్రపరిచి ఉందని చెప్తుంటారు. ఆయన శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని శరీరాన్ని విడిచిపెట్టారు. ఇప్పటికీ శరీరం అక్కడే ఉంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు ఆయనకు ఉత్సవాలు చేస్తారు. అప్పుడు కర్పూరం, కుంకుమ పువ్వు కలిపి నూరి... ఆ మిశ్రమాన్ని శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఎర్రగా కనిపిస్తుంది. 

వెంకన్నది విష్ణురూపమే!
ఆపద మొక్కులవాడు తిరుపతి వేంకటేశ్వర స్వారి విగ్రహం విష్ణువు రూపమే అని నిర్ధారించింది కూడా రామానుజాచార్యులే. వెంకన్న విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహం కాదని, శివుడి విగ్రహమో, సుబ్రహ్మణ్యమూర్తి విగ్రహమో కావచ్చని శైవులు వాదించారు. దాంతో వైష్ణవులు, శైవులకు మధ్య తగాదా ఏర్పడింది. అప్పట్లో తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు దగ్గరకు శైవులు వెళ్లి తిరుమలలో వైష్ణవ పూజలకు బదులు శైవారాధనలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు దగ్గరకు వెళ్ళి శైవులతో వాదించారు. పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను చూపించి విగ్రహం విష్ణుమూర్తిదే అని ఒప్పించారు. అంతేకాదు.. వేంకటేశ్వరుడి విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు పెట్టి ‘‘ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు” అని ప్రార్థించి తలుపులు మూశారట. తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖుచక్రాలు ఆయుధాలుగా కనిపించాయట. దాంతో మూలవిరాట్టు విష్ణువు అవతారమేనని నిర్ధారణ జరిగింది. అప్పుడు తిరిగి వైష్ణవ ఆరాధనలు మొదలయ్యాయి. తర్వాత కాలంలో కూడా తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేందుకు ఆయన ఏకాంగి వ్యవస్థను ఏర్పాటు చేశారు. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది కూడా రామానుజులే అని చెప్తుంటారు.
 

ప్రపంచంలోనే రెండో పెద్ద విగ్రహం
శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల విగ్రహం ప్రపంచంలోని కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాల్లో రెండో అతిపెద్దది. మొదటిది థాయిలాండ్‌‌‌‌‌‌‌‌లోని బుద్ధ విగ్రహం. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు వస్తున్నారు. 
 

216 అడుగుల ఎత్తు
ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ఎత్తు 216 అడుగులు. అందులో పద్మాసనంలో కూర్చున్నట్టు ఉండే రామానుజుల విగ్రహం ఎత్తు 108 అడుగులు. కింద ఉన్న భద్రవేదిక ఎత్తు 54 అడుగులు.  పద్మపీఠం ఎత్తు 27 ఫీట్లు. రామానుజుల చేతిలోని త్రిదండం 135 అడుగుల ఎత్తు.  పద్మం కింద 36 ఏను‌‌‌‌‌‌‌‌గులు, తామర పువ్వుకు 54 రేకులు ఉన్నాయి.  8 శంఖాలు, 18 చక్రాలు  ఉన్నాయి. రామానుజుల విగ్రహాన్ని బంగారం, వెండి, కంచు, రాగి, ఇత్తడితో తయారు చేశారు. ఈ పంచలోహ విగ్రహం బరువు 1,800 టన్నులు.  చైనాకు చెందిన ఏరోసన్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ సంస్థ క్యాస్టింగ్‌‌‌‌‌‌‌‌ చేసింది. దాదాపు 200 మంది ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ 9 నెలల పాటు కష్టపడి 1,600 విడి భాగాలుగా విగ్రహాన్ని క్యాస్టింగ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ భాగాలను ఇండియాకు తీసుకొచ్చి ఒకచోట చేర్చి విగ్రహంగా మలిచారు. వాతావరణ పరిస్థితులను తట్టుకుని దాదాపు వెయ్యేండ్లు ఈ విగ్రహం చెక్కు చెదరకుండా ఉండేటట్టు తయారుచేశారు. 
2014లో...
ఈ విగ్రహ ఏర్పాటుకు 2014లో నిర్ణయం తీసుకున్నప్పటికీ 2016లో పనులు మొదలయ్యాయి. 2017లో విగ్రహం పూర్తైంది. ఈ ప్రాజెక్ట్‌‌ ఖర్చు దాదాపు వెయ్యికోట్ల రూపాయలు.  దాదాపు 2,700 మంది శిల్పులు ఇక్కడ పనిచేశారు. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి ఈ కట్టడాన్ని పూర్తి చేశారు. 
 

108 పుణ్యక్షేత్రాలు 
నలభై ఎకరాల్లో ఉన్న ఈ క్షేత్రంలో రామానుజుల మహా విగ్రహంతోపాటు చుట్టూ శ్రీవైష్ణవంలో దివ్య దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల నమూనా ఆలయాలను నిర్మించారు. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం,  అయోధ్య, ఉరైయూర్, తంజమా మణిక్కోయిల్, అన్బిల్, కరంబనూర్, తిరువెళ్ళరై, బృందావనం, కుంభకోణం.. ఇలా అన్ని ప్రధాన వైష్ణవాలయాలు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటినీ కలుపుతూ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్ద మండపాన్ని ఏర్పాటుచేశారు. 
 

120 కిలోల బంగారు విగ్రహం
భారీ సమతామూర్తి విగ్రహంతోపాటు... విగ్రహం కింద గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. ఈ విగ్రహానికి నిత్యపూజలు చేస్తారు. రామానుజాచార్యులు 120 సంవత్సరాలు బతికారు. అందుకే ఇక్కడ 120 కిలోల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గర్భగుడి మెయిన్‌‌‌‌‌‌‌‌డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు అన్ని ద్వారాలకు బంగారు రేకులను తొడిగారు. 
 

1035 హోమకుండలాలు 
రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా హోమం చేస్తున్నారు. అందుకోసం దేశం నలుమూలల నుంచి ఐదు వేల మంది రుత్వికులు వస్తున్నారు. దిక్కుకు 36 చొప్పున నాలుగు దిక్కుల్లో 144 యాగశాలల ఏర్పాటు చేశారు. వాటితోపాటు సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1035 హోమ కుండలాలు ఉన్నాయి. వాటిలో వేసేందుకు రెండు లక్షల కిలోల ఆవు నెయ్యి వాడతారు. రాజస్తాన్‌‌‌‌‌‌‌‌, గుజరాత్‌‌‌‌‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల్లోని దేశీయ ఆవుల పాలతో స్వచ్ఛమైన నెయ్యిని తయారుచేయిస్తున్నారు. రుత్వికులు కోటిసార్లు అష్టాక్షరి మహా మంత్రాన్ని జపిస్తారు. హోమ కుండలాల్లో కాల్చేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా పిడకలు తయారుచేయిస్తున్నారు. 
 

డైనమిక్‌‌‌‌‌‌‌‌ ఫౌంటెయిన్‌‌‌‌‌‌‌‌
విగ్రహం చుట్టూ కట్టిన 108 ఆలయాలను అనుసంధానించే మండపంలో అష్టదళ పద్మాకృతిలో 45 అడుగుల ఎత్తున ఫౌంటెయిన్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. దీని కోసం దాదాపు 25 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఈ క్షేత్రంలోనే స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఎట్రాక్షన్‌‌‌‌‌‌‌‌. ఈ డైనమిక్‌‌‌‌‌‌‌‌ ఫౌంటెయిన్‌‌‌‌‌‌‌‌ వచ్చేవాళ్లకు స్వాగతం చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఫౌంటెయిన్‌‌‌‌‌‌‌‌లోని పద్మాలు విచ్చుకుంటున్నట్టు అందులో రామానుజాచార్యులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఫౌంటెయిన్‌‌‌‌‌‌‌‌ నీళ్లతో రామానుజాచార్యులకు అభిషేకం చేస్తున్నట్టు కనిపిస్తుంది.  
స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఎట్రాక్షన్స్‌‌‌‌‌‌‌‌
ఈ క్షేత్రంలో విగ్రహంతోపాటు చాలా స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఎట్రాక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ప్రతిరోజూ సాయంత్రం  అగుమెంటెడ్‌‌‌‌‌‌‌‌ రియాలిటీ  షో(3డీ) 18 నిమిషాల పాటు ఏర్పాటు చేస్తారు. ఇందులో రామానుజులు చెప్పిన సమానత్వాన్ని చాటే విషయాలు ఉంటాయి. ఈ షోని ఒకేసారి 3,600 మంది చూడొచ్చు. ఈ ప్రాంగణంలో దాదాపు రెండు లక్షల మొక్కలు నాటారు. క్షేత్రంలో పింక్‌‌‌‌‌‌‌‌ గ్రానైట్‌‌‌‌‌‌‌‌తో చేసిన ఆకృతులు ఆకట్టుకుంటాయి. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే గ్యాలరీ కూడా ఉంది. వేదాల కోసం ఏర్పాటు చేసిన లైబ్రరీ, పండి‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌భల కోసం కట్టిన ఆడి‌‌‌‌‌‌‌‌టో‌‌‌‌‌‌‌‌రియం, ఓమ్నీ మాక్స్‌‌‌‌‌‌‌‌ థియే‌‌‌‌‌‌‌‌టర్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఎట్రాక్షన్స్‌‌‌‌‌‌‌‌ అవుతాయి. 

ఆచార్యుడు ఇచ్చిన సందేశాలు
సంప్రదాయాలుగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి, సామాజిక పురోగతికి అడ్డురాక ముందే వాటిని గుర్తించాలి. సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రథమ కర్తవ్యం.
దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను

పెంచుకోవటం మూర్ఖత్వం
 మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు. ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం... కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

రామానుజుని ప్రతిజ్ఞ
తనగురువు తనకు చెప్పిన తిరుమంత్రాన్ని ప్రజలందరికి తెలియజెప్పి తనమతంలో తరతమాలు లేవని నిరూపించినవాడు రామానుజుడు.తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయుటకు పూనుకుని ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారిని సైతం చిరునవ్వుతో లాలించి గౌరవించేవాడు. తనను గౌరవింపమని, తన మతాన్ని పెంపొందింపమని ఏరాజును అర్ధించలేదు. వైష్ణవాన్ని బలవంతంగా ఎవరికి ఇప్పించలేదు.ఆనాడు కులోత్తుంగ చోళుడు తనకున్న అధికారగర్వంతో సామ్రాజ్యాలను కబళించాడు. ఆ రాజు శైవుడు. అందుచేతనే తన దేశంలో వైష్ణవుడు ఉండటానికి వీల్లేదని హింసలు పెట్టాడు. ఇట్టి పరిస్థితులు దేశంలో ఉన్నప్పటికి రామానుజుడు తన మతాన్ని ప్రచారం చేయటం ఆపలేదు. దేశంలో అందరు రామానుజుని ప్రతిభను గుర్తించారు. రామానుజుని ప్రతిభ కులోత్తుంగుని హృదయాన్ని మానని గాయం చేసింది. రామానుజుని వర్గం ఒక వైపున వైష్ణవ మత ప్రచారం చేస్తున్నది. మరొకవైపున కులోత్తుంగుడు దానిని నాశనం చేయుటకు పూనుకున్నాడు. కులోత్తుంగ ప్రధాని త్రిపురాంతకుడు ప్రేరణ వలన కులోత్తుంగుడు రామానుజుని పైన ద్వేషం ఏర్పరచుకున్నాడు. రాజు, రామానుజుని బంధించాలని ప్రయత్నించాడు. కాని సాధించలేకపోయాడు. చివరకు కులోత్తుంగుడు తానుచేసిన తప్పిదాన్ని గ్రహించి, అటుపై జీవితంలో ఎదురైన సమస్యలకు తాళలేక సిగ్గుపడి దుఃఖపడి ప్రజలకు మతస్వాతంత్ర్యం ప్రదానం చేసాడు. ప్రదానం చేసిన తరువాత ప్రజల పరిస్థితులు తెలుసుకోకుండానే కులోత్తుంగుడు కన్నుమూశాడు. శైవ, వైష్ణవ మతాలమధ్య జరిగిన ఉద్యమంలో రామానుజుడే చివరకు జయించాడు.

ఇక్కడే ఎందుకు? 
రామానుజాచార్యులు తమిళనాడులో పుట్టి పెరిగారు. దేశమంతటా తిరిగి సమతావాదాన్ని బోధించినా ఎక్కువ కాలం ఉన్నది మాత్రం శ్రీరంగం, కాంచీపురంలోనే. అయినా.. విగ్రహాన్ని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ దగ్గర్లో ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారంటే.. కారణం ఈ స్థలానికున్న ప్రత్యేకతే. ఈ స్థలం గురించి ఒకసారి చిన జీయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వామి ఏం చెప్పారంటే.. “మేము 2004లో మొదటిసారి ఈ ప్రాంతాన్ని చూశాం. అప్పుడే ఇది ఒక అద్భుతమైన స్థానం అవుతుందని అనుకున్నాం. ఈ ప్రదేశం మధ్యలో ఎత్తుగా ఉండి, చుట్టూ పల్లంగా ఉంటుంది. అంటే ఇది కూర్మాకృతిలో ఉండే భూమి. పండితులు ఈ భూమిని చూసినప్పుడు ఇక్కడ ఏ కార్యం చేసినా లోకానికి అద్భుతమైన ప్రభావాన్ని అందిస్తుందని చెప్పారు. అదే నిజమైంది. ముందుగా ఇక్కడ ఒక చిన్న ఆలయం, ధ్యానం చేసుకోవడానికి ఒక పెద్ద హాలు కట్టాలనుకున్నాం. కానీ.. ఇప్పుడు ఇంత పెద్ద ఆలయ నిర్మాణం జరిగింది” అన్నారు. అంతటి యోగ్యమైన భూమి కాబట్టే విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. 

కార్యక్రమాలు 
ఫిబ్రవరి 3: అగ్ని ప్రతిష్ఠ, అష్టాక్షరి జపం
5న: వ‌‌‌‌‌‌‌‌సంత పంచమి నాడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సమ‌‌‌‌‌‌‌‌తా‌‌‌‌‌‌‌‌మూర్తి విగ్రహ ఆవిష్కరణ. 
8న: ధర్మసమ్మేళనం 
11న: సామూహిక ఉపనయనం
12న: విష్ణు సహస్రనామ పారాయణం
13న: రామా‌‌‌‌‌‌‌‌ను‌‌‌‌‌‌‌‌జా‌‌‌‌‌‌‌‌చార్య సువర్ణ ‌‌‌‌‌‌‌‌మూర్తి విగ్రహ ఆవిష్కరణ
14న: మహా పూర్ణాహుతి