రామయ్య పెళ్లికొడుకాయనే..

రామయ్య పెళ్లికొడుకాయనే..
  • భద్రాద్రిలో పెళ్లి పనులు షురూ

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామయ్యకు పెళ్లి కళ వచ్చింది. వసంతమాడిన జగదభిరాముడిని కనులారా చూసిన భక్తులు పులకించిపోయారు. తలంబ్రాలు కలిపే వేడుకతో ఆదివారం సీతారాముల పెళ్లి పనులు ప్రారంభించారు. ఏప్రిల్‍21న శ్రీరామనవమి రోజున కల్యాణోత్సవంలో వినియోగించే  తలంబ్రాలను కలిపేందుకు రామదండు తరలివచ్చింది. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఆదివారం తలంబ్రాలు కలిపే వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. ఓ వైపు తలంబ్రాలు కలపడం, మరోవైపు వసంతోత్సవం, ఇంకోవైపు ఊంజల్‍ ఉత్సవం ఇలా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి(డోలా పౌర్ణమి) రోజున రామయ్యను పెళ్లి కుమారుడిని చేయడం సంప్రదాయం. వాస్తవంగా చైత్ర శుద్ధ పంచమి నాడు పెళ్లి కుమారునిగా అలంకరిస్తారు. ఆ రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే ఆగమశాస్త్రం ప్రకారం  డోలా పౌర్ణమి రోజున ఆలయంలో వసంతోత్సవం ఘనంగా జరగడం, ఇదే రోజున ఊంజల్‍ సేవ నిర్వహించడంతో రామయ్య పెళ్లి కుమారుడు అయ్యాడని భక్తులు నమ్ముతారు. వసంతోత్సవం సందర్భంగా  స్వామికి ఈవో శివాజీ నూతన వస్త్రాలను సమర్పించారు. రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో సీతారామ లక్ష్మణ స్వామిని ఆశీనులను చేసి ప్రత్యేక కీర్తనలు ఆలపిస్తూ మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ జరిగింది. 
కోలాహలంగా వసంతోత్సవం
ప్రాకార మండపంలో సీతారామచంద్రస్వామికి వసంతోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. స్వామికి 25 కలశాలతో విశేష స్నపన తిరుమంజనం జరిగింది.  నూతన వస్త్రాలతో స్వామిని అలంకరించారు. అత్తరు, పన్నీరు, బుక్కా, గులాల్‍, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, వివిధ రంగులలతో తయారు చేసిన మిశ్రమాన్ని సీతారామచంద్రస్వామిలపై చల్లారు. ఆ తర్వాత అదే మిశ్రమాన్ని నీటిలో కలుపుకొని ఆలయ సిబ్బంది, అధికారులు, భక్తులు వసంతమాడారు.  తర్వాత ఆస్థాన హరిదాసులు స్వామి కీర్తనలు పాడుతుండగా వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు స్వామిని ఉయ్యాలలో  ఊపుతూ డోలోత్సవం నిర్వహించారు. సాయంత్రం వసంత రాముడికి తిరువీధి సేవ జరిగింది. పవళింపు సేవ రద్దు చేశారు.  

కల్యాణం టిక్కెట్​ పైసలు వాపస్
ఏప్రిల్‍ 21న శ్రీరామనవమి సీతారాముల కల్యాణం కరోనా కారణంగా ఈసారి కూడా అంతరంగికంగానే నిర్వహించనున్నారు. కొవిడ్​ సెకెండ్‍ వేవ్‍ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్‍లైన్‍లో శ్రీరామనవమి టిక్కెట్లు బుక్‍ చేసుకున్న భక్తులకు తిరిగి డబ్బులు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటివరకు రూ.9.5 లక్షల విలువ చేసే టిక్కెట్లు ఆన్‍లైన్‍లో బుక్ అయ్యాయి. ఈ డబ్బులు తిరిగి ఇచ్చేయనున్నారు. భక్తులెవరూ కల్యాణానికి భద్రాచలం రావొద్దంటూ సర్కారు ఆంక్షలు విధించింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలోనే సీతారాముల కల్యాణం నిర్వహిస్తామని ప్రకటించింది.