- మేధావులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి: బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు
- పార్టీలో చేరిన డాక్టర్లు, ఫార్మా నిపుణులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు విధానాలు చెప్పడం మానేసి, బూతుల పురాణం ఎత్తుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు ప్యాంట్ విప్పుతా అంటే.. మరొకరు తోలు తీస్తా అంటూ మాట్లాడుతున్నారని.. వారి మాటలను జనం అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు. ఇలాంటి రాజకీయ సంస్కృతి రాబోయే తరానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ చెత్త రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు మేధావులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సాయి చంద్ర నేతృత్వంలో పలువురు డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, ఫార్మా రంగ నిపుణులు బీజేపీలో చేరారు. వారికి రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. గతంలో రాజకీయాలంటే డబ్బున్నవాళ్లు, క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్లే వచ్చేవాళ్లని.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపేది, దేశద్రోహ శక్తులను అణచివేసేది ఒక్క నరేంద్ర మోదీ నాయకత్వమేనని యువత నమ్ముతోందన్నారు.
వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని సూచించారు. మజ్లిస్ పార్టీని, కాంగ్రెస్ దుర్మార్గాలను అడ్డుకోవాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. కర్నాటకలోనూ మళ్లీ బీజేపీ అధికారంలోకి రాబోతోందని, తెలంగాణ కూడా త్వరలోనే కాషాయమయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ నేతలు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, మాధవరం కాంతారావు, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే కాంగ్రెస్కు జాతీయ హోదా గల్లంతు
ఖమ్మంలో సీపీఐ మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, ఆయన మత్తులో మాట్లాడినట్టుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. దేశమంతా మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నదని, కాంగ్రెస్ మాత్రం కనుమరుగయ్యే దశకు చేరుకున్నదని ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో 2జీ, బొగ్గు, కామన్వెల్త్ వంటి స్కాములతో దేశం కుదేలైందని రాంచందర్ రావు అన్నారు. మోదీ పాలనలో దేశం అవినీతిరహితంగా, పారదర్శకంగా ముందుకు సాగుతున్నదన్నారు.
జాతీయ హోదా కోల్పోయిన సీపీఐ సభకు వెళ్లి రేవంత్ మాట్లాడుతున్నారని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కూడా జాతీయ హోదా గల్లంతయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాంచందర్ రావు జోస్యం చెప్పారు. అదానీ, అంబానీ పేర్లు చెప్పి బీజేపీని విమర్శించే రేవంత్ రెడ్డి.. సీఎంగా బాధ్యతలు చేపట్టాక అంబానీతో ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ చర్చల వివరాలను బయటపెట్టాలన్నారు.
