రాంచందర్రావు నియామకం..బీజేపీ, బీఆర్ఎస్ ఉమ్మడి నిర్ణయం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

రాంచందర్రావు నియామకం..బీజేపీ, బీఆర్ఎస్ ఉమ్మడి నిర్ణయం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • ఆ రెండు పార్టీలది మ్యాచ్ ఫిక్సింగ్ నాటకం: చామల

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ ల ఉమ్మడి నిర్ణయంతోనే కమలం పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా రాంచందర్​రావు నియామకం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలిచేందుకు.. బీఆర్ఎస్ ఏం చేసిందో అందరికీ తెలుసున్నారు. అదే విధంగా ఆ పార్టీలు కలిసి పని చేస్తున్నాయన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో చామల మీడియాతో మాట్లాడారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. తెలంగాణలో అరాచక పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీని బీజేపీ నేతలు కనీసం ఒక్క మాట అనకపోవడమే ఆ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందానికి నిదర్శనం అన్నారు.

పదేండ్ల పాలన వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజల్లో వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నదన్నారు. కాళేశ్వరం దోపిడీ, ఫోన్ టాపింగ్ వ్యవహారాలతో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఆదరణ కోల్పోయిందన్నారు. వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతోనే మీడియా సంస్థలపై దాడులు చేస్తున్నారన్నారు.

కనీసం మెట్రో పర్మిషన్లు తేలేదు

బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే.. రాష్ట్ర అభివృద్ధికి వాళ్లు ఏనాడు సహకరించలేదన్నారు. మెట్రో, రింగ్‌‌‌‌‌‌‌‌రోడ్డు తదితర అంశాలపై పలుమార్లు మా సీఎం ఢిల్లీ వచ్చి, ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తుంటే తమపై నిందలు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రోకు అనుమతులు ఇచ్చే ఉద్దేశం లేకనే డీపీఆర్‌‌‌‌‌‌‌‌ పేరుతో సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌-మహారాష్ట్ర వ్యాపారుల కోసం బుల్లెట్‌‌‌‌‌‌‌‌ ట్రైన్‌‌‌‌‌‌‌‌ మంజూరు అయిందని.. తెలంగాణ ప్రజల కోసం బీజేపీ ఎంపీలు మెట్రో అనుమతులు కూడా తీసుకురాలేదని అన్నారు.