పతంజలి ఉత్పత్తుల నిషేధంపై స్పందించిన రామ్ దేవ్ బాబా

పతంజలి ఉత్పత్తుల నిషేధంపై స్పందించిన రామ్ దేవ్ బాబా

పతంజలి సంస్థకు చెందిన 5 ఉత్పత్తులపై నిషేధం విధించారన్న వార్తలపై పతంజలి వ్యాపార భాగస్వామి బాబా రామ్ దేవ్ స్పందించారు. ఆయుర్వేద వ్యతిరేక డ్రగ్ మాఫియా తమకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని పతంజలి సంస్థ ఆరోపించింది. అంతే కాదు ఆ ఆర్డర్‌ కాపీ తమకింకా అందలేదని పేర్కొంది. పతంజలి తయారు చేసిన అన్ని ఉత్పత్తులు అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉంటాయిని తెలిపింది. దాదాపు 500మంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారుచేస్తామని స్పష్టం చేసింది. ఆయుర్వేదం, యునాని సర్వీసెస్ ఉత్తరాఖండ్ స్పాన్సర్ కు సంబంధించిన ఎలాంటి కాపీని తాము అందుకోలేదని చెప్పింది. ఈ కుట్రలో భాగమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

 మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బీపీ గ్రిట్, లిపిడామ్ అనే పేర్లతో దివ్య ఫార్మసీ పతంజలి ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించినట్టు ఇటీవల వార్తలు వినిపించాయి. ఆయుర్వేదంతో షుగర్ ని పరిగెత్తిస్తా, బీపీని కంట్రోల్ పెడతా, థైరాయిడ్ కి చరమగీతం పాడతానంటూ రామ్ దేవ్ బాబా ఇప్పటికే  ప్రచారం చేసుకుంటుంటారు. అయితే ఇలాంటి ప్రచారం సరికాదని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి అభిప్రాయం వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ఉత్పత్తులపై నిషేధం విధించిందని, దీంతో పతంజలి దివ్య ఫార్మసీకి చెందిన ఐదు ఉత్పత్తుల తయారీ, అమ్మకాలను ఆపేసిందని తమ అనుమతులు పొందిన తర్వాతే వీటి తయారీని తిరిగి ప్రారంభించుకోవచ్చని తెలిపినట్టు టాక్.