రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు కడుతున్నం

రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు కడుతున్నం
  • వేర్​హౌజింగ్​ బిజినెస్​లోకి వస్తున్నం
  • ప్రకటించిన రామ్​కీ గ్రూప్​

హైదరాబాద్​, వెలుగు:  చెన్నై, బెంగళూరు  హైదరాబాద్‌‌లలో 15 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.10 వేల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌‌లను నిర్మిస్తున్నట్లు రామ్‌‌కీ గ్రూప్‌‌కు చెందిన రామ్‌‌కీ ఎస్టేట్స్ తెలిపింది. వచ్చే 3–-5 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నాలుగు  మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 3,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ మూడు నగరాల్లో తమకు 1,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని అని రామ్కీ ఎస్టేట్స్ డైరెక్టర్ తారకేష్ రాజేష్ దాసరి తెలిపారు. హైదరాబాద్ ​బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కంపెనీ ఇప్పటివరకు రూ. 3,500 కోట్ల విలువైన 10 మిలియన్ చదరపు అడుగుల్లో హౌజింగ్​ ప్రాపర్టీలను పూర్తి చేసిందని చెప్పారు.  2023–-24లో రూ. 2,000 కోట్ల కంటే ఎక్కువ మొత్తం బుకింగ్స్​ వస్తాయని భావిస్తున్నామని, రెసిడెన్షియల్ యూనిట్ల ధరలు రూ. 45 లక్షల నుండి రూ. 5 కోట్ల వరకు ఉంటాయని అని రామ్కీ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ నంద కిషోర్ తెలిపారు. కమర్షియల్​ రియల్టీకి పెట్టుబడులు ఎక్కువగా కావాలని, ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టే ఆ సెగ్మెంట్లో తమకు ఎక్కువ ప్రాజెక్టులు లేవని చెప్పారు.

90:10 నిష్పత్తికి కట్టుబడి ఉంటామని, తమ దగ్గర 90 శాతం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉంటే, మిగిలిన పదిశాతం కమర్షియల్​ ప్రాజెక్టులు ఉంటాయని వివరించారు. అయితే, ఈ–-కామర్స్ సంస్థల నుంచి పెరుగుతున్న డిమాండ్‌‌ను పరిగణనలోకి తీసుకుని, వేర్‌‌హౌసింగ్ రంగంలోకి ప్రవేశించాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 3–-4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వేర్‌‌హౌసింగ్ స్థలాన్ని అభివృద్ధి చేస్తామని కిషోర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇండ్ల కొనుగోలుదారుల కోసం మెటావర్స్ విండో  ‘రామ్​కీ వెర్స్​’ను ప్రారంభించింది. వినియోగదారులు వర్చువల్​ రియాల్టీ ద్వారా తమ ఇంట్లో నుంచే ప్రాపర్టీలను చూడవచ్చు. ఈ సదుపాయం జూలై 14 నుండి అందుబాటులోకి వస్తుంది.