
- జీతాలు పెంచాలని రాంకీ డ్రైవర్లు, కార్మికుల సమ్మె
- లేబర్ కమిషనర్ ఆఫీస్ వద్ద ఆందోళన
- సాయంత్రం కార్మికులతో చర్చలు జరిపిన రాంకీ
- జీతాలు పెంచుతామనడంతో సమ్మె విరమణ
హైదరాబాద్ సిటీ, వెలుగు:నగర వ్యాప్తంగా ట్రాన్స్ ఫర్ స్టేషన్స్ లో రెండు రోజుల పాటు చెత్త పేరుకుపోయింది. జీతాలు పెంచాలని విధులు బహిష్కరించి రాంకీ డ్రైవర్లు, కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్స్ నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించే ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిపోయాయి. స్వచ్ఛ ఆటోలు తీసుకొచ్చిన చెత్తను నగరంలోని 42 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ నుంచి డంపిండ్ యార్డుకు తరలించకపోవడంతో చెత్త పేరుకుపోయింది.
నగరం నుంచి ప్రతీ రోజు 270 ట్రక్కుల ద్వారా చెత్తను జవహర్ నగర్ డంపింగ్ రాంకీ తరలిస్తుంది. రాంకీ సంస్థలో 2,500 మంది డ్రైవర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. జీతాలు పెంచితే తప్ప విధుల్లోకి చేరబోమని వారు సమ్మెకు దిగారు. మంగళవారం సీఐటీయూ అనుబంధ రాంకీ(హెచ్‌ఐఎంఎస్‌డబ్ల్యుసీ అండ్ టీ) ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాంకీ డ్రైవర్లు, సిబ్బంది లేబర్ కమిషనర్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. డ్రైవర్లకు రూ.6,500, గ్రేడ్ వారికి రూ.6,300, హెల్పర్లకు రూ.5,500 జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
అప్పటి వరకు విధుల్లో చేరబోమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యూనియన్ అధ్యక్షుడు భాస్కర్ హెచ్చరించారు. డ్రైవర్లకు రూ.18,500, కార్మికులకు రూ.16 వేల జీతం మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చర్చలు సఫలం, సమ్మె విరమణ..
జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ తో యాజమాన్యం ప్రతినిధులు, యూనియన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. యాజమాన్యం వేతనాలను పెంచేందుకు అంగీకరించింది. డ్రైవర్లలో గ్రేడ్ –1 వారికి ప్రస్తుతం పొందుతున్న వేతనంపై రూ.6,500, గ్రేడ్–2 డ్రైవర్లకు రూ.6,300, ఆన్ స్కిల్డ్ హెల్పర్లకురూ.5 వేలు పెంచేందుకు రాంకీ యాజమాన్యం అంగీకరించింది. దీంతో డ్రైవర్లు, కార్మికులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.