
- సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టును ప్రపంచ నంబర్ వన్ విమానాశ్రయంగా మార్చేందుకు కృషి చేస్తానని సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తెలంగాణలో మరిన్ని ఎయిర్పోర్టులను నిర్మిస్తామని..దానికి అవసరమైన సర్వేకూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం శంషాబాద్ ఎయిర్పోర్టులో సెకండ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ 2024 కార్యక్రమం నిర్వహించారు. దీనికి రామ్మోహన్ నాయుడు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. 10కే రన్ ప్రారంభించారు.'ఏక్ పెడ్ మాకే నాంపే'లో భాగంగా ఎయిర్ పోర్ట్ సిబ్బందితో కలిసి కలిసి మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.." చంద్రబాబు కృషి వల్లే హైదరాబాద్ లో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఆ ఎన్నోసమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. శంషాబాద్ లో ఇంత పెద్ద ఎయిర్ పోర్ట్ విమానాశ్రయం అవసరమా అన్నరు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో నిలిచింది. భవిష్యత్తులో హైదరాబాద్ విమానాశ్రయాన్ని ప్రపంచ నంబర్ వన్ విమానాశ్రయంగా మార్చేందుకు కృషి చేస్తా" అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తల్లిని ప్రేమించినట్లుగానే ప్రకృతిని సైతం ప్రేమించాలని కోరారు. చెట్లు నాటడాన్ని బాధ్యతగా భావించాలని విజ్ఞప్తి చేశారు.