- డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు హాస్పిటళ్లలో ఇష్టారీతిన టెస్టులు
- ఆడ శిశువని తెలిస్తే గర్భస్రావానికి ఏర్పాట్లు
- పెద్ద మొత్తంలో వసూలు.., రిఫరల్ డాక్టర్లకు వాటాలు!
- ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ఆఫీసర్లు
మార్చి 26న హనుమకొండకు చెందిన ఓ మహిళ ఏడు నెలల గర్భంతో బాలసముద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లింది. అన్ వాంటెడ్ ప్రెగ్నెన్సీ కావడంతో పెద్ద మొత్తంలో ప్యాకేజీ మాట్లాడుకుని ఆ హాస్పిటల్ నిర్వాహకులు ఆమెకు అబార్షన్ చేసేందుకు అడ్మిట్ చేసుకున్నారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగి ఆ మహిళ మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా, అబార్షన్ వల్ల మహిళ మరణించిన విషయం బయటకు పొక్కకుండా సదరు హాస్పిటల్ యాజమాన్యం జాగ్రత్త పడగా, విచారణ చేపట్టి యాక్షన్ తీసుకోవాల్సిన ఆఫీసర్లు వారితోనే కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెత్తాయి.
ఐనవోలు మండలం పున్నేలులో తల్లీ, ఇద్దరు కూతుళ్లు స్విమ్మింగ్ పూల్ లో శవాలుగా తేలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షనే వారి ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చిందనే వాదనలున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకున్న అజారుద్దీన్ రెండుసార్లు అబార్షన్ చేయించగా, మూడోసారి అలాగే గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నం చేసినట్లు మృతురాలి పేరెంట్స్ ఆరోపించారు. మళ్లీ అబార్షన్ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు మొదలై చివరకు తల్లీ, ఇద్దరు కూతుళ్ల ప్రాణాలు పోయే దాకా వచ్చిందని చెబుతున్నారు.
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. కొన్ని స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు హాస్పిటళ్లు ప్రధానంగా ఈ రెండింటిపైనే ఆధారపడి నడుస్తుండగా, తమ వద్దకు వచ్చినోళ్ల నుంచి నెలలను బట్టి పెద్ద మొత్తంలో దండుకుంటూ బిజినెస్ చేస్తున్నాయి. దీంతోనే లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలకు అడ్డుకట్ట పడటం లేదు.
కాసుల కక్కుర్తితో స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారీతిన టెస్టులు, అబార్షన్లు చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో అనర్థాలు జరుగుతుండగా, ఈ దందాకు చెక్ పెట్టాల్సిన ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులకే వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విచ్చలవిడిగా టెస్టులు, అబార్షన్లు..
వరంగల్ నగరంలో డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు హాస్పిటల్స్ వందల సంఖ్యలో వెలిశాయి. ఇందులో కొన్ని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు యథేచ్ఛగా లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు. రూరల్ ఏరియాల నుంచి ఆర్ఎంపీలు, పీఎంపీలు రిఫర్ చేస్తుండగా, గర్భంలో ఉన్నది పాపో, బాబో చెప్పడంతో పాటు ప్యాకేజీలు మాట్లాడుకుని అబార్షన్లు కూడా చేసేస్తున్నారు. ఈ మేరకు లింగ నిర్ధారణ టెస్టులకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తుండగా, అబార్షన్లకు వారి ఆర్థిక స్థితిని బట్టి రూ.లక్ష వరకు గుంజుతున్నారు. వరంగల్ నగరంలోని చాలాచోట్ల ఇదే దందా సాగుతుండటం గమనార్హం.
తనిఖీల్లేవ్.. చర్యల్లేవ్..
గర్భస్థ శిశు నిర్ధారణ నియంత్రణ చట్టం (పీసీపీఎన్డీసీఏ) ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, అందుకు సహకరించడం నేరం. కానీ, వరంగల్ నగరంలో అదంతా కామనైపోయింది. ఇష్టారీతిన లింగ నిర్ధారణ టెస్టులు చేయడం, ఆ తర్వాత అవసరాన్ని బట్టి అబార్షన్లు చేసేయడం పరిపాటిగా మారింది. కొన్నేండ్ల నుంచి వరంగల్ ట్రై సిటీలో ఈ దందా పెద్ద ఎత్తున నడుస్తుండటంతో దాదాపు మూడేండ్ల కిందట సీపీగా ఏవీ రంగనాథ్ ఉన్న సమయంలో టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసి నగరంలోని డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు హాస్పిటల్స్ పై నిఘా పెట్టారు.
ఇల్లీగల్ గా అబార్షన్లు చేస్తున్న 18 మంది ముఠాను అరెస్ట్ చేశారు. అందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్ల డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉండటం గమనార్హం. వాస్తవానికి ఇలాంటి ఇల్లీగల్ టెస్టులు, అబార్షన్లకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు అధికారులు క్షేత్రస్థాయిలో కనీసం తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు వినిస్తున్నాయి. ఇప్పటికైనా లింగ నిర్ధారణ, అబార్షన్ల విషయంలో జరుగుతున్న అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
