
సీనియర్ నటుడు నరేష్ , పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమాకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.
ఈ సినిమా తన ప్రతిష్టను కించిపరిచేలా ఉందని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సినిమా విడుదలను ఆపేలా అదేశాలు ఇవ్వాలని రమ్య కోర్టును కోరారు. ఈ క్రమంలో కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. నిజానికి మళ్లీ పెళ్లి సినిమా 2023 మే 26న రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్ , పవిత్రా లోకేష్ కీలక పాత్రలు పోషించారు. నరేష్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతి. ఆమెను 2010లో మూడో వివాహం చేసుకున్నారు నరేష్. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. గతకొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.