లిఫ్ట్ వచ్చిందనుకున్నాడు.. 4అంతస్తుల పైనుంచి కింద పడ్డాడు

లిఫ్ట్ వచ్చిందనుకున్నాడు.. 4అంతస్తుల పైనుంచి కింద పడ్డాడు

ఒక వృద్ధుడు లిఫ్ట్ షాఫ్ట్‌లో పడి మరణించిన బాధాకరమైన సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంచీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కథనం ప్రకారం, మృతుడు శైలేష్ కుమార్‌గా గుర్తించారు. ఈ వైరల్ క్లిప్ లో ఓ వృద్ధుడు లిఫ్ట్ డోర్ ఓపెన్ కావడంతో లోపలికి అడుగుపెట్టి.. ఆ గ్యాప్ లో పడిపోయాడు.

మృతుడు ఒడిశాలోని హిందీ పాఠశాల ఉపాధ్యాయుడు. అతను అదే బిల్డింగ్ లో నాలుగో అంతస్తులో ఉంటున్నాడు. లిఫ్ట్ కోసం వేచి చూస్తూ బటన్‌ను నొక్కిన శైలేష్.. లిఫ్ట్ రాలేదని తెలియక ఎలివేటర్ డక్ట్‌లోకి ప్రవేశించి.. షాఫ్ట్‌లో నాలుగు అంతస్తులు కింద పడిపోయాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన అతడి పక్కనే మరో వ్యక్తి నిలబడి అక్కడే ఉండిపోయాడు.

లిఫ్ట్ సమీపంలోని ఫ్లాట్లలో ఉన్న వ్యక్తులు ఏం జరిగిందో గ్రహించి వెంటనే గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరుకున్నారు. భవనం వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ పెద్ద శబ్దాలు వినిపించాయని చెప్పారు. అందరూ అతడిని రక్షించేందుకు పరుగెత్తారు. అయితే శైలేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడని నివేదికలు తెలిపాయి. ఘటన తర్వాత లిఫ్ట్‌ను సీల్‌ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.