- మూసీని స్వచ్ఛమైన నదిగా తీర్చిద్దుతాం
- ఆరు నెలల్లో మూసీ సీవరేజ్ప్లాంట్ఏర్పాటు
- మూడు నెలల్లో బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేస్తాం
- తొలి విడతలో 65 వేల ఎకరాలకు నీళ్లు
- ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండ, వెలుగు : రూ.40 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపడుతామని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ, నార్కట్పల్లి మండలాల్లో మంత్రి పర్యటించారు. నకిరేకల్ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఆరు నెలల్లో మూసీ సీవరేజ్ప్లాంట్ఏర్పాటు చేసి మూడేళ్లలో మూసీని స్వచ్ఛమైన నదిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మూసీ ప్రక్షాళనతో నల్గొండ జిల్లాను శాశ్వత ఫ్లోరైడ్రహిత జిల్లాగా మారుస్తామని చెప్పారు. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి పట్టుదలతో కృషి చేస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టును మూడు నెలల్లో పూర్తిచేస్తామన్నారు. తొలి విడతలో 65 వేల నుంచి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. బ్రాహ్మణ వెల్లంల జడ్పీహైస్కూల్లో తరగతి గదులతోపాటు డైనింగ్ హాల్, టాయిలెట్ల నిర్మాణ పనులు 15 రోజుల్లో పూర్తిచేస్తామని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంలలో త్వరలోనే కోటి రూపాయాల నిధులతో పేదలకు ఇండ్లు కట్టిస్తామని, రూ.70 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
ఫ్లై ఓవర్ పనుల పరిశీలన..
నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే కుడివైపు మూడు లేన్ల పనులు పూర్తి చేసి నెలలోపు ట్రాఫిక్సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆరు లేన్ల ఫ్లైఓవర్నిర్మాణ పనులకు సంబంధించి మిషన్ భగీరథ వాటర్ పైప్లైన్లు తక్షణమే మార్చాలని సూచించారు. అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంల పాఠశాలను జిల్లాలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని
కష్టపడి చదువుకుంటేనే జీవితాలు బాగుపడతాయని విద్యార్థులకు సూచించారు. నియోజకవర్గంలోని 50 పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యనందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సినిమాటోగ్రఫీలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.