గ్రేటర్ వరంగల్/ కాశీబుగ్గ, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి వరంగల్ కలెక్టరేట్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద, జిల్లా ఎన్నికల ఖర్చుల పరిశీలకులు సునయన చౌహాన్ నిశితంగా పరిశీలించారు. మొదటి విడతలో పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి, రెండో విడతలో గీసుగొండ, దుగ్గొండి, నల్లబెల్లి, సంగెం మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, పీవో, ఓపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.
జిల్లాలోని మొదటి విడతలోని 85 జీపీలు 731 వార్డు స్థానాలకు, రెండో విడతలో 114 గ్రామ పంచాయతీలు, 984 వార్డులకు ఎన్నికల నిర్వహణకు కేటాయింపులు చేశారు. కాగా, వరంగల్ జిల్లాలో జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు డిసెంబర్ 11వ, 14వ, 17వ తేదీల్లో స్థానిక సెలవుగా ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆమె వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా వేర్ హౌజ్గోదాముల్లో భద్రపర్చిన ఈవీఎంలను అడిషనల్ కలెక్టర్ సంధ్యారణితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

