
- రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్
ఎల్బీనగర్, వెలుగు: చెంచుల జీవనోపాధి కోసం మెరుగైన వసతులకు కల్పించేందుకు ప్లానింగ్ సిద్ధం చేయాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఆమన్గల్, కడ్తాల్ మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో, జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్ (పీఎం – జన్‌మన్) పథకం ఆమన్ గల్, కడ్తాల్ మండలాల్లో నివాసముంటున్న చెంచులకు అందేలా చేయాలన్నారు. వారి జీవన స్థితిగతుల పూర్తిస్థాయి వివరాలను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్,ఆమన్ గల్, కడ్తాల్ మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.