ఇబ్రహీంపట్నంలో పోస్టల్​ బ్యాలెట్​ బాక్సులు ఓపెన్

ఇబ్రహీంపట్నంలో పోస్టల్​ బ్యాలెట్​ బాక్సులు ఓపెన్
  • ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించని రిటర్నింగ్ ఆఫీసర్
  • కొన్నింటికి సీల్, తాళాలు ఓపెన్.. కొన్ని బాక్సులు ఖాళీ
  • కాంగ్రెస్ నేతల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జ్
  • ఆర్డీఓ ఆఫీస్​కు కలెక్టర్​.. విచారణ జరుపుతున్నట్లు వెల్లడి


హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. స్ట్రాంగ్‌రూమ్‌లో ఉండాల్సిన పోస్టల్‌ బ్యాలెట్లు ఆర్డీవో కార్యాలయంలో ఉండటం, పోస్టల్‌ బ్యాలెట్ బాక్సుల సీల్‌ తొలగించి ఉండటం, కొన్ని ఖాళీగా ఉండటంపై కాంగ్రెస్ నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు, ఏజెంట్లు నిరసనలకు దిగారు. ఏజెంట్లకు తెలియకుండా, ఎవరూ లేకుండా రిటర్నింగ్ అధికారి, సిబ్బంది వాటిని ఎలా ఓపెన్ చేస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. 

బ్యాలెట్ బాక్సులు ఖాళీగా కనిపించడంపై నిలదీశారు. దీంతో ఆర్డీవో కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులపై కొందరు రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి వెంటనే ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

స్ట్రాంగ్‌ రూమ్స్‌కు పంపలే?

పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించలేదని, ఆర్డీవో కార్యాలయంలోనే ఓపెన్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. భువనగిరి, ఇబ్రహీంపట్నంతోపాటు చాలా నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాచారని అంటున్నారు. మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. 

స్ట్రాంగ్ రూమ్స్‌కు ఎందుకు పంపలేదని ఆర్డీవోను అడిగితే సమాధానం లేదని, ఇలాగే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో జరిగినట్లు తమకు సమాచారం ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి నేతల ఆందోళన తర్వాత పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించి, సీల్ వేసినట్లు సమాచారం.