ప్రేమపేరుతో వేధింపులు.. భరించలేక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

ప్రేమపేరుతో వేధింపులు.. భరించలేక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

ప్రేమపేరుతో వేధింపులను తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన గుత్తి జంగయ్య, పద్మ దంపతుల కూతురు నవ్య(14) కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన తోటి విద్యార్థి కొమ్మగోని నందీశ్వర్ తనను ప్రేమించాలని నవ్యను కొద్దికాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆరునెలల క్రితమే బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. అయితే కొద్దిరోజులు సైలేంట్ గానే ఉన్న నందీశ్వర్ తర్వాత మళ్లీ వెంటపడటం ప్రారంభించాడు.

బాలిక ఇంటి చుట్టూ తిరుగుతూ.. మానసికంగా ఇబ్బంది పెట్టాడు. ఇదే గ్రామానికి చెందిన క్లాస్మేట్ రాజేష్ తోపాటు మరోతోటి విద్యార్థిని సహకారంతో ఇన్స్టాగ్రామ్ (బాలిక కుటుంబ సభ్యుల ఫోను)లో నవ్యను వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది.

పొలం పనులు ముగించుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి చేరిన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూసేసరికి చీరతో ఉరేసుకుని కనిపించింది. నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న ముగ్గురు విద్యార్థులను పిలిచి విచారిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.