రూ. 10 కోట్లిస్తామంటే..గౌరవంతో వద్దన్నా..

రూ. 10 కోట్లిస్తామంటే..గౌరవంతో వద్దన్నా..

ఆంధ్రప్రదేశ్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మొదట టీడీపీ తనతో బేరసారాలు జరిపిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు అమ్ముకుంటే పదికోట్లు వచ్చేవని రాపాక తెలిపారు. ఈ ఆఫర్ ను పార్టీ పైన ఉన్న గౌరవం, నమ్మకంతో వదిలేశానని వెల్లడించారు. రాజోలులో జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన ఈ విషయాల్ని బయటపెట్టారు. 

రాపాక స్నేహితుడు కేఎస్ఎన్ రాజుతో టీడీపీ లీడర్లు బేరాలు జరిపారని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు.. టీడీపీకి ఓటేస్తే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తూ తనకు డబ్బులిచ్చే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఈ విషయం గురించి వివరిస్తూ.. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకొని తిరగలేము. సిగ్గు శరం వదిలేసి ఉంటే పదికోట్లు వచ్చి ఉండేవి అన్నారు. తను పార్టీకి ఎప్పుడు వెన్ను పోటు పొడవనని, నిజాయితీగా పనిచేస్తానని రాపాక చెప్పుకొచ్చారు.