తల్వార్‌తో కేక్ కట్ చేసిన గుర్మీత్ రామ్ రహీమ్

తల్వార్‌తో కేక్ కట్ చేసిన గుర్మీత్ రామ్ రహీమ్

పెరోల్‌పై బయటకు వచ్చిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కత్తితో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అత్యాచారం, హత్య కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సిర్సా-డేరా చీఫ్... శనివారం హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని సునారియా జైలు నుండి 40 రోజుల పెరోల్‌పై వచ్చారు. వచ్చిన వెంటనే  ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని తన బర్నావా ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తల్వార్ తో రామ్ రహీమ్  కేక్‌ను కట్ చేసే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదేళ్ల తర్వాత ఇలా సెలబ్రేట్ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి తాను కనీసం ఐదు కేక్‌లు కట్ చేయాలనుకుంటున్నానని, ఇది మొదటి కేక్ అని రామ్ రహీమ్ వీడియోలో చెప్పారు. 

ఆయుధ చట్టం ప్రకారం ఇలా బహిరంగంగా ఆయుధాలను ప్రదర్శించడం నిషేధం. ఈ నేపథ్యంలో రామ్ రహీమ్ ఇలా తల్వార్ తో కేట్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా జనవరి 25న డేరా మాజీ చీఫ్ షా సత్నామ్ సింగ్ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని రామ్ రహీమ్ తన బెయిల్ దరఖాస్తులో పేర్కొన్నారు. రామ్ రహీమ్‌కు పెరోల్ మంజూరు కావడం ఇదేం మొదటిసారి కాదు. గత 14 నెలల్లో ఇది నాలుగోసారి. మూడు నెలల్లో రెండుసార్లు రామ్ పెరోల్ పొందారు. అంతకుముందు హర్యానా పంచాయితీ ఎన్నికలు, అడంపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు అతను అక్టోబర్ 2022లో 40 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు.