పైసా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. కన్నపేగు,తోడబుట్టిన సంబంధాలను తెంచింది.. పైసకిచ్చిన విలువ మనిషికి ఇవ్వలేదని ఓ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..
సెల్ఫీ వీడియో తీసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచలో విషాదం నింపింది. మంగళవారం (జనవరి27) గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి అనే యువకుడు పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు ముందు సెల్ఫీ వీడియో తీసి స్థానిక ఎస్సై, అతని కుటుంబ సభ్యులు, బంధువులకు పంపించాడు.
రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి..తన చావుకు కుటుంబ సభ్యులే కారణమని.. తాను చనిపోతున్నందుకు తనను క్షమించాలని భార్య,మిత్రులకు, బంధువులకు క్షమాపణలు చెబుతూ తీసిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. న్యాయం చేయాలని చిగురుమామిడి ఎస్సైకి వీడియోను షేర్ చేశాడు.
ఓ షాపునిర్వహణకు సంబంధించి కుటుంబ సభ్యులతో జరిగిన గొడవలతోనే వెంకటేశ్వర్ రెడ్డి ప్రాణాలు తీసుకుంటున్నట్లు వీడియోలో తెలిపాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను మోసం చేసి చనిపోతున్నందుకు బాధపడుతున్నాను. వ్యాపారంలో పెట్టిన పది లక్షలు తన భార్యకు ఇప్పించాలని, ఆడబ్బుతో ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని ఎస్సై, పెద్దమనుషులను కోరడం కంటతడిపెట్టించింది.
