Sai Pallavi: సూపర్ స్టార్ సరసన లేడీ పవర్ స్టార్.. రజినీకాంత్ 173లో సాయి పల్లవి?

Sai Pallavi: సూపర్ స్టార్ సరసన లేడీ పవర్ స్టార్.. రజినీకాంత్ 173లో సాయి పల్లవి?

వరుస సినిమాతో ఫుల్ జోష్ లో ఉంది నటి సాయి పల్లవి. తన సహజ నటనతో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే, మేకప్ లేకుండా నటించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.  ఈ బ్యూటీ సినీ ప్రయాణం ఇప్పుడు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు.. చిన్నాచితకా సినిమాల నుంచి పాన్ ఇండియా లెవల్ వరకు జైత్రయాత్రలా సాగుతోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆమె ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.

రజినీకాంత్ మూవీలో సాయి పల్లవి?

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ , దర్శకుడు  నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'జైలర్ 2 '  షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.  తదుపరి శిబి చక్రవర్తి దర్శకత్వంలో, కమల్ హాసన్ నిర్మాణంలో 'రజనీకాంత్ 173' సినిమా తెరకెక్కనుంది . ఈ  సినిమాలో సాయి పల్లవి నటించడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కమల్ హాసన్ నిర్మాణంలో వచ్చిన 'అమరన్' చిత్రంలో సాయి పల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. శివకార్తికేయన్ సరసన ఆమె పోషించిన 'ఇందు రెబెక్కా వర్గీస్' పాత్ర ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ఈ నేపథ్యంలో, ఆమె ప్రతిభను గుర్తించిన కమల్ హాసన్, మరోసారి తన నిర్మాణ సంస్థలో సూపర్ స్టార్ సరసన నటించే అవకాశాన్ని ఆమెకు కల్పించినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో 'సీతమ్మ'గా.. 

సాయి పల్లవి క్రేజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాలేదు. బాలీవుడ్ దిగ్గజాలు సైతం ఆమె కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు.  నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణం'లో రణబీర్ కపూర్ (రాముడు) సరసన సీతగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. జునైద్ ఖాన్ (అమీర్ ఖాన్ కుమారుడు) సరసన 'ఏక్ దిన్'  సినిమాలో కూడా నటించింది

సాయి పల్లవి ఇతర హీరోయిన్లకు భిన్నంగా ఉండటమే ఆమె సక్సెస్ సీక్రెట్ అంటున్నారు అభిమానులు. కోట్లు సంపాదిస్తున్నా, స్టార్ హోదా ఉన్నా కూడా ఆమె లైఫ్ స్టైల్ చాలా సాధారణంగా ఉంటుంది. లగ్జరీ కార్లు, క్యారవాన్ల కంటే కథకే ఆమె ప్రాధాన్యత ఇస్తుంది. సౌత్ నుంచి నార్త్ వరకు, చిన్న దర్శకుల నుంచి కమల్ హాసన్, రజినీకాంత్ వంటి దిగ్గజాల వరకు అందరి ఫేవరెట్ హీరోయిన్‌గా మారడం అంటే మామూలు విషయం కాదంటున్నారు.. తన నటనతో, వ్యక్తిత్వంతో ఒక సరికొత్త ముద్ర వేసిన సాయి పల్లవి, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్..