ఇండియన్ టాలెంట్ అంటే ఇదీ.. మన బైక్ మెకానిక్ టాలెంట్ కళ్లారా చూసి నోరెళ్లబెట్టిన విదేశీ జంట !

ఇండియన్ టాలెంట్ అంటే ఇదీ.. మన బైక్ మెకానిక్ టాలెంట్ కళ్లారా చూసి నోరెళ్లబెట్టిన విదేశీ జంట !

మన దేశంలో టాలెంట్ ఉన్న జనాలకు కొదవే లేదు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వాళ్లు లేక చాలామంది స్కిల్ ఉన్నా ఎదుగూ బొదుగూ లేక మరుగున పడిపోతున్నారు. అలాంటి ఒక బైక్ మెకానిక్ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మన దేశానికి చెందిన ఈ బైక్ మెకానిక్ టాలెంట్కు యూరప్కు చెందిన యూట్యూబర్ జంట ఫిదా అయింది. 

వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ టాలెంటెడ్ బైక్ మెకానిక్ గురించి ప్రపంచానికి తెలిసింది. విషయం ఏంటంటే.. యూరప్కు చెందిన ఒక జంట ఇండియా విజిట్ చేయడానికి వచ్చింది. ఈ టూర్లో భాగంగా సిమ్లా కూడా వెళ్లింది. అయితే.. లగ్జరీ బైక్పై సిమ్లా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంటకు బైక్ ట్రబుల్ ఇచ్చింది.

Lavi & Ollie పేరుతో యూట్యూబ్ జర్నీని మొదలుపెట్టిన ఈ జంట బైక్పై ప్రపంచాన్ని చుట్టేయాలని డిసైడ్ అయింది. ఈ ట్రిప్లో భాగంగా ఇండియాకు వచ్చింది. 3 నెలల క్రితం సిమ్లాలో రయ్మని బైక్పై ఈ జంట వెళుతుండగా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఏం చేయాలో పాలు పోని స్థితిలో రోడ్డు పక్కన కనీసం ఒక రూఫ్ కూడా లేకుండా బైక్స్ రిపేర్ చేస్తున్న ఒక మెకానిక్ దగ్గరకు తమ బైక్ను తోసుకుంటూ వెళ్లారు. బైక్ కండీషన్ చూసిన మన మెకానిక్ బేరింగ్ ఫెయిల్యూర్ కారణంగా బైక్ ఆగిపోయిందని గుర్తించాడు. చకచకా బైక్ ఇంజిన్ను ఏ పార్ట్కు ఆ పార్ట్ ఊడదీశాడు. సమస్యను గుర్తించాడు. సొల్యూషన్ చూపించి బైక్ రిపేర్ చేశాడు.

ఇదే పనికి.. ప్రొఫెషనల్స్ అయితే వేలల్లో వసూలు చేస్తారని.. రిపేర్ కు రోజుల కొద్దీ టైం తీసుకుంటారని.. మనోడు జస్ట్ ఒక గంటలో మొత్తం సెట్ చేసి బైక్ రిపేర్ చేశాడని సోషల్ మీడియా ఈ బైక్ మెకానిక్ స్కిల్ను ఆకాశానికి ఎత్తేసింది. అతనికి ఎలాంటి కాలేజ్ డిగ్రీ లేదు. గట్టిగా మాట్లాడితే సరైన మెకానిక్ షెడ్ కూడా లేదు. ఉన్నదల్లా ఒక్కటే.. చేతుల్లో సత్తా..  బుర్ర నిండా నైపుణ్యం.

సదరు యూరప్ జంట కూడా ఈ మెకానిక్ స్కిల్ చూసి ఆశ్చర్యపోయింది. ఇండియాలో ఇలాంటి స్కిల్ ఉన్న జనం ఎందరో ఉన్నా ఇన్ స్టాగ్రాంలో కాలక్షేపం కోసం వీడియోలు చేసే వాళ్లు ఫేమస్ అవుతున్నారని.. నిజమైన ఇన్ ఫ్లుయెన్సర్లకు గుర్తింపు దక్కడం లేదని కొందరు నెటిజన్లు ఈ టాలెంటెడ్ మెకానిక్ స్థితిని చూసి నిట్టూర్చింది.