Kane Richardson: వరల్డ్ కప్‌తో పాటు 500 పైగా వికెట్లు: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్

Kane Richardson: వరల్డ్ కప్‌తో పాటు 500 పైగా వికెట్లు: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ ప్రొఫెషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. మంగళవారం (జనవరి 27) ఇంస్టాగ్రామ్ వేదికగా రిచర్డ్‌సన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 2009లో ఆస్ట్రేలియా జట్టులో అరంగేట్రం చేసిన ఈ ఆసీస్ పేసర్ 17 ఏళ్ళ తర్వాత తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా జట్టుతో పాటు బిగ్ బాష్ లీగ్ లో రిచర్డ్‌సన్ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్ లో ఈ ఆసీస్ పేసర్ తన మార్క్ చూపించాడు. చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడిన రిచర్డ్‌సన్..ఈ మూడేళ్ళలో జట్టులో స్థానం కోసం పోరాడినా ఫలితం లేకపోయింది.    

"ఈ బిగ్ బాష్ లీగ్ ఆడి నేను ప్రొఫెషనల్ క్రికెట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. 2009లో నా అరంగేట్రం నుండి ఇప్పటివరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. నా కెరీర్ ముగించడానికి ఇదే నాకు సరైన సమయం. నా కెరీర్‌ను తీర్చిదిద్దిన కోచ్‌లు, నిర్వాహకులు, తోటి ఆటగాళ్లకు ముఖ్యంగా సౌత్ ఆస్ట్రేలియాకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అదృష్టం నాకు కలిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీ జట్లతో పాటు, ఆస్ట్రేలియాకు కూడా ప్రాతినిధ్యం వహించాను". అని రిచర్డ్‌సన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశాడు.

34 ఏళ్ల రిచర్డ్‌సన్ ఆస్ట్రేలియా తరఫున 25 వన్డేలు, 36 టీ20 మ్యాచ్ ల్లో ఆడాడు. మొత్తం 84 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 102 వికెట్లు.. లిస్ట్ ఎ క్రికెట్‌లో 153 వికెట్లు.. టీ20ల్లో 241 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ లో రిచర్డ్‌సన్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ గా నిలిచాడు. 118 మ్యాచ్‌ల్లో 142 వికెట్లు తీసి టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా తన కెరీర్ ముగించాడు. 2021 టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలుచుకున్నప్పుడు రిచర్డ్‌సన్ జట్టులో ఉన్నాడు.