ప్రముఖ మల్టీప్లెక్స్ దిగ్గజం PVR INOX తన వ్యాపార వ్యూహంలో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ గౌర్మెట్ పాప్‌కార్న్ బ్రాండ్ 4700BCని నిర్వహిస్తున్న 'జియా మైజ్' కంపెనీ నుండి పీవీఆర్ ఐనాక్స్ పూర్తిగా తప్పుకుంది. తనకున్న వాటాను ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికోకు రూ.226.8 కోట్లకు అమ్మేసింది.
రూ.5 కోట్ల పెట్టుబడి.. రూ.226 కోట్ల లాభం
ఈ సేల్ డీల్ పీవీఆర్ ఐనాక్స్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. 2015లో కేవలం రూ.5 కోట్లతో జియా మైజ్‌లో 70 శాతం వాటాను కొనుగోలు చేసిన పీవీఆర్ సంస్థ.. ఇప్పుడు దానిని దాదాపు 45 రెట్ల అధిక ధరకు అమ్మి లాభాలు చేసుకుంది. కేవలం పాప్‌కార్న్ బ్రాండ్‌గానే కాకుండా.. స్నాకింగ్ రంగంలో దూసుకుపోతున్న 4700BC విలువ పెరగడమే ఇందుకు కారణం.
4700BC బ్రాండ్ సామర్థ్యాన్ని తాము ముందే గుర్తించి ప్రోత్సహించామని, ఇప్పుడు అది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని పీవీఆర్ ఐనాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజిలీ అన్నారు. సినిమా థియేటర్ల వ్యాపారం తమ ప్రధాన రంగం కాబట్టి, ఇతర నాన్ కోర్ వ్యాపారాల నుంచి లాభాలతో బయటకు రావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
►ALSO READ | పెద్ద స్క్రీన్, 5G సపోర్ట్ తో రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే !
భారతీయ స్నాకింగ్ మార్కెట్ 2023లో రూ.45వేల కోట్లుగా ఉండగా, 2030 నాటికి అది రూ.85వేల కోట్లకు చేరుతుందని అంచనా. ముఖ్యంగా ప్రీమియం స్నాక్స్ బిజినెస్ 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికే సఫోలా వంటి బ్రాండ్ల యజమాని అయిన మారికో.. 4700BCని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇకపై ఈ పాప్‌కార్న్ బ్రాండ్ కేవలం థియేటర్లలోనే కాకుండా.. గల్లీలోని కిరాణా షాపుల నుంచి సూపర్ మార్కెట్ల వరకు అన్ని చోట్లా అందుబాటులోకి రాబోతోంది.
