విత్తనం భూమిలో నాటిన దగ్గర్నుంచి పంట చేతికొచ్చే వరకు బోలెడన్ని రసాయనాలు కలుస్తాయి. ఇక కూరగాయల సాగులో అయితే పెస్టిసైడ్స్ డోస్ ఒకింత ఎక్కువగానే ఉంటుంది. కానీ చాలామంది ఆ రసాయనాల గురించి ఆలోచించకుండా నీళ్లతో పైపైన కడిగి వంట చేస్తారు. కానీ అలా సరిగా శుభ్రం చేయని కూరగాయల్ని తినడం వల్ల భవిష్యత్తులో చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మార్కెగ్ నుంచి కూరగాయలు ఇంటికి రాగానే ఇట్ల శుభ్రం చేయాలి.
చల్లటి నీళ్లతో : ప్రతి ఇంట్లో వంట మొదలుపెట్టడానికి ముందు కూరగాయల్ని ట్యాప్ కింద ఓ అరనిమిషం ఉంచుతారు. కానీ ఆ అరనిమిషంలో కూరగాయలపై ఉన్న రసాయనాలు, దుమ్ము, ధూళీ పోవు. కనీసం ఒక ఐదారు నిమిషాలైనా కూరగాయల్ని చల్లటి నీళ్లలో ఉంచాలి. ఆకుకూరల్ని అయితే ఒక పదినిమిషాల పాటు నీళ్లలో నానబెట్టి కడగాలి. రెండు మూడు సార్లు నీళ్లని మారుస్తూ ఉండాలి. యాపిల్, జామకాయ, ద్రాక్ష, మామిడి లాంటి పండ్లనైతే నాలుగైదు సార్లు కడగాలి. అలాగే కడిగే ముందు తప్పనిసరిగా గౌజ్లు ధరించాలి..
వెనిగర్ : కొన్ని మొండి రసాయనాలు, దుమ్ము, ధూళీ ఎంత కడిగినా అసలు పోవు. అలాంటప్పుడు 90 శాతం నీళ్లలో, 10 శాతం వెనిగర్ కలిపి శుభ్రం చేయాలి. వెనిగర్, నీళ్ల మిశ్రమంలో 20 నిమిషాల పాటు కూరగాయల్ని నానబెట్టి కడగాలి. ఇలా చేయడం వల్ల కూరగాయలు తేలిగ్గా శుభ్రపడతాయి.
►ALSO READ | Health : మీకు, మీ పిల్లలకు పాలు పడటం లేదా.. బాదం పాలు బెస్ట్.. 5 అద్భుత ప్రయోజనాలు కూడా..!
ఈ పద్దతిలో కూడా కూరగాయల్ని తేలిగ్గా క్లీన్ చేయొచ్చు. ఒక లీటర్ మంచినీళ్లలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా లేదా ఉప్పు కలిపి కూరగాయల్ని రెండు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచితే కూరగాయలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళీ వదులుతాయి. పండ్లను అయితే ఈ నీళ్లలో అరగంట పాటు ఉంచాలి.
నిమ్మకాయతో : బాటిల్ లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, ఒక కప్పు నీళ్లు కలిపి 30 సెకన్ల పాటు షేక్ చేయాలి. ఆ నీళ్లతో కూరగాయల్ని కడిగితే బ్యాక్టీరియా నిమిషాల్లో మాయమవుతుంది. అలాగే మరిగించిన నీళ్లలో కూరగాయల్ని మూడు నిమిషాలు ఉంచినా బ్యాక్టీరియా పోతుంది.
-వెలుగు, లైఫ్–
