అత్యాచార బాధితులకు అందని సాయం

అత్యాచార బాధితులకు అందని సాయం
  • పెండింగ్ లో రేప్‌, కిడ్నాప్‌, ట్రాఫికింగ్‌, యాసిడ్‌ దాడి బాధితుల పరిహారం
  • వేలల్లో బాధితులు.. వందల్లో దరఖాస్తులు
  • వారికి కూడా ఇప్పటికీ పైసా ఇవ్వని ప్రభుత్వం   
  • 925 మంది దరఖాస్తుదారుల ఎదురుచూపులు

హైదరాబాద్‌‌, వెలుగు:కామాంధుల అకృత్యాలకు, ప్రేమోన్మాదుల ఘాతుకానికి, దళారుల మోసాలకు గురైన బాధితులకు ప్రభుత్వ సాయం అందడం లేదు. ఏటా వేలల్లో కేసులు నమోదవుతున్నా.. సాయం కోసం వందల్లో మత్రమే దరఖాస్తులు వస్తున్నాయి. అయితే వారికి సైతం సాయం చేయడానికి ప్రభుత్వానికి చేయి వస్తలేదు. రేప్‌‌, పోక్సో, వరకట్న హత్య, కిడ్నాప్, మహిళల అక్రమ రవాణా, యాసిడ్ దాడుల బాధితులకు ఆర్థిక సాయం అందించి అండగా నిలబడేందుకు ప్రభుత్వం 2012లో జీవో ఎంఎస్‌‌ నంబర్‌‌ 28ను విడుదల చేసింది. అయితే ఈ జీవో గురించి, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం గురించి  చాలా మంది బాధితులకు తెలియకపోవడంతో దరఖాస్తు చేసుకునేవారు కూడా తక్కువే. ఈ ఏడాది మే నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 925 మంది బాధితులు ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసి ఎదురుచూస్తున్నారు. వీరికి ఇవ్వాల్సిన రూ.2.96 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. సాయం కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో అత్యధికంగా 228 మంది రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు. ఈ ఒక్క జిల్లాకే 53.9 లక్షలు విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 198 కేసుల్లో  బాధితులతో కామారెడ్డి జిల్లా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో 120 పోక్సో కేసు బాధితులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు లెటర్లు రాసినా స్పందన కనిపించడం లేదు.

దరఖాస్తు చేయని వారు వేలల్లో..

2013 నుంచి 2019 జనవరి నెలాఖరు వరకు రాష్ట్రంలో ఒక్క పోక్సో చట్టం కిందే 8,142 కేసులు బుక్‌‌ అయ్యాయి. 2013లో 281 కేసులు నమోదు కాగా, 2018 లో  2080కు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే రాష్ట్రంలో 137 కేసులు రిజిస్టరయ్యాయి. వాటిలో 30 పోక్సో కేసులు వికారాబాద్ జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. ఈ ఆరేళ్లలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 967 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇలా లైంగికదాడి, హింస, వేధింపులకు సంబంధించి వేలల్లో కేసులు నమోదవుతున్నా.. దరఖాస్తు చేస్తుంది చాలా కొద్ది మందే… అయినా వారి కూడా సాయం అందించక పోవడంపై
విమర్శలు వస్తున్నాయి.

జీవో నంబర్‌ 28 ప్రకారం వివిధ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం వివరాలు..

కేసు                             పరిహారం

గ్యాంగ్రేప్                        రూ.లక్ష

రేప్కేసు                    రూ.50 వేలు

వరకట్న హత్య             రూ.50 వేలు

ట్రాఫికింగ్                   రూ.20 వేలు

కిడ్నాప్                     రూ.20 వేలు

యాసిడ్దాడులు                రూ.లక్ష

గొంతు కోసిన ఘటనలు      రూ.50 వేలు