నిర్మల్ లో రింగింగ్ స్టోన్స్ గుర్తింపు : ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు

నిర్మల్ లో రింగింగ్  స్టోన్స్ గుర్తింపు : ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు

నిర్మల్, వెలుగు: నిర్మల్  జిల్లా కేంద్రంలోని గుట్టలపై చాలా చోట్ల రాగాలు పలికే అరుదైన రాళ్లు (రింగింగ్  స్టోన్స్) గుర్తించినట్లు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. ఈ బండరాళ్లను భూ భౌతిక వారసత్వంగా సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రాగాలు పలుకుతున్న రాళ్లపై ఆయన పరిశోధనలు చేసినట్లు తెలిపారు. 66 మిలి యన్  ఏండ్ల కింద డెక్కన్  ట్రాప్స్  ఏర్పడిన సమయంలో అగ్నిపర్వత విస్పోటనాల వల్ల పైకి వచ్చిన లావా గట్టిపడి బసాల్ట్  శిలలుగా మారాయని చెప్పారు. 

ఈ ప్రక్రియలో ఏర్పడిన కొన్ని శిలలు ఘన నిర్మాణం కారణంగా శబ్ద తరంగాలను ధ్వనింపజేస్తుంటాయని తెలిపారు. వీటిని శాస్త్రీయంగా లిథోఫోన్స్  అని పిలుస్తారని, ఈ రాయిని మరో రాయితో లేదా పనిముట్లతో కొట్టినప్పుడు కంచు మోగినట్లు  మధురమైన స్వరాలు వినిపిస్తాయని చెప్పారు. దీంతో వీటిని రింగింగ్  స్టోన్స్  లేదంటే రాగాలు పలికే రాళ్లుగా పిలుస్తారని తెలిపారు. జిల్లాలోని మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి రాళ్లు ఉన్నట్లు గుర్తించామని,  బాసర వద్ద వేదశిలగా పిలిచే రాయి కూడా ఇలాంటి స్వరాలు పలికే బసాల్ట్ శిలగా భావిస్తున్నట్లు తెలిపారు. 

నిర్మల్ లోని ఖిల్లా గుట్ట పశ్చిమం వైపు ఉన్న రాళ్ల శ్రేణిలో పెద్ద బండరాళ్లు కూడా స్వరాలు పలికే లక్షణం కలిగి ఉన్నాయని, అక్కడికి చేరుకోవడం ప్రమాదకరం కావడంతో అక్కడికి వెళ్లలేక పోతున్నారని చెప్పారు. జిల్లాలోని ఇలాంటి బండరాళ్లను గుర్తించి జియో హెరిటేజ్  స్పాట్ గా అభివృద్ధి చేసి సంరక్షించాలని కోరారు. ఆయన వెంట ప్రముఖ కవులు నేరెళ్ల హనుమంతు, అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, దొంతుల భీమేశ్​ ఉన్నారు.