కడియం వల్లే బీఆర్ఎస్‌‌ను వీడిన రాజయ్య, ఆరూరి : రసమయి బాలకిషన్

కడియం వల్లే బీఆర్ఎస్‌‌ను వీడిన రాజయ్య, ఆరూరి : రసమయి బాలకిషన్

హైదరాబాద్, వెలుగు :  కడియం శ్రీహరి వైఖరి వల్లే వరంగల్ జిల్లాలో తాడికొండ రాజయ్య, ఆరూరి రమేశ్‌‌ బీఆర్ఎస్‌‌ను వీడారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్‌‌లో సభ్యత్వం లేని కావ్యకు కేసీఆర్‌‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ఎంపీ కె.కేశవరావుకు మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఫైర్‌‌‌‌ అయ్యారు.

కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణ బతుకుల మీద విషం చిమ్ముతున్నదని, ఆ పార్టీ తెలంగాణ ద్రోహి పార్టీ అన్నారు. మిలియన్ మార్చ్‌‌లో కేకేను కోడిగుడ్లతో కొట్టిన ఘటనను బాలకిషన్ గుర్తుచేశారు. కేశవరావు బిడ్డ గద్వాల విజయలక్ష్మి ఎవరికీ తెలియదని, ఆమెను కేసీఆర్ మేయర్‌‌ను చేశారన్నారు. ఓట్ల కోసం గద్దర్‌‌‌‌ను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. తాము కేసీఆర్ వెంటే ఉంటామని, పార్టీ ఆదేశిస్తే వరంగల్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.