Rashid Khan: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అగ్రస్థానానికి ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్

Rashid Khan: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అగ్రస్థానానికి ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్

టీ20 క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన హవా కొనసాగుతున్నాడు. జాతీయ జట్టు, ఐపీఎల్ తో పాటు ప్రపంచంలో ఎక్కడ టీ20 లీగ్ జరిగినా రషీద్ అదరగొడతాడు. అందుకే ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ ను పోటీ పడి మరీ తీసుకుంటారు. తన స్పిన్ మాయాజాలంతో టీ20 క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న రషీద్ ఖాన్.. తాజాగా టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసుకొన్న బౌలర్ గా నిలిచాడు. 

ట్రై సిరీస్ లో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 1) యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో రషీద్ 165 వికెట్లతో సౌథీని వెనక్కి నెట్టి అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ముందువరకు సౌథీ 164 వికెట్లతో టాప్ లో ఉండగా.. రషీద్ మూడు వికెట్లతో అగ్ర స్థానానికి చేరుకోవడంతో రెండో స్థానానికి పడిపోయాడు. యూఏఈ బ్యాటింగ్ ఆల్ రౌండర్ 
ధ్రువ్ పరాశర్ వికెట్ పడగొట్టి రషీద్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఆఫ్ఘనిస్తాన్ 38 పరుగుల తేడాతో గెలిచింది. 

ఓవరాల్ గా టీ20 క్రికెట్ లోనూ రషీద్ ఖాన్ అగ్ర స్థానంలో ఉండడం విశేషం. 480 పైగా ఇన్నింగ్స్‌ల్లో 18.54 సగటుతో 650 పైగా వికెట్లు పడగొట్టి టాప్ లో ఉన్నాడు. 582 మ్యాచ్‌ల్లో బ్రావో 631 వికెట్లతో రెండో స్థానంలో.. 589 వికెట్లతో వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (547), బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (498) వికెట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 26 ఏళ్ల ఈ రషీద్ ఖాన్ ఇటీవలే జరిగిన ఐపీఎల్ సీజన్ 2025లో పెద్దగా రాణించలేదు. 15 మ్యాచ్‌లలో 57.11 సగటుతో 9 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. ఐపీఎల్ లో విఫలమైనా హండ్రెడ్ లీగ్ లో ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ ఫామ్ లోకి వచ్చాడు.