మీకు కారుందా?.. అయితే రేషన్ కార్డ్ కట్

మీకు కారుందా?.. అయితే రేషన్ కార్డ్ కట్


కరీంనగర్‌‌‌‌, వెలుగు: ‘మీకు కారు ఉందా? మూడున్నర ఎకరాల కంటే ఎక్కువ భూమికి రైతుబంధు వస్తోందా? ఐటీ రిటర్న్స్​ ఫైల్​ చేస్తున్నారా?’ ఇందులో ఏ ఒక్కదానికి మీ ఆన్సర్ ‘యస్​​’ అయినా మీకు కొత్త రేషన్​ కార్డు రాదు. అంతే కాదు, మున్ముందు చేపట్టబోయే రేషన్ ​కార్డుల ఏరివేతలో ఇప్పటికే ఉన్న పాత రేషన్​ కార్డు పోవచ్చు. ప్రభుత్వం తెచ్చిన కొత్త గైడ్​లైన్స్​ ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్లకు మాత్రమే రేషన్ ​కార్డులు ఇవ్వాలని కలెక్టర్లకు స్ట్రిక్ట్​ఆర్డర్స్​ వచ్చాయి. ఇందుకోసం సర్కారు ప్రత్యేక సాఫ్ట్​వేర్​ ద్వారా ‘360 డిగ్రీస్ అనాలిసిస్’  చేస్తోంది. కొత్తగా వచ్చిన అప్లికేషన్లలోని ఆధార్​నంబర్​ను ఆ సాఫ్ట్​వేర్​లో ఎంటర్​ చేయగానే పైన ఆప్షన్ల​కు సరిపోయే అప్లికేషన్లకు ‘రిజక్టెడ్​’ అని వస్తోంది. ఆ తర్వాత మిగిలిన అప్లికేషన్లను తీసుకొని వీఆర్వోలు, ఆర్ఐలు ఇల్లిల్లూ తిరిగి వెరిఫికేషన్​ చేస్తున్నారు. ఏ మాత్రం తేడా కొట్టినా లిస్టులోంచి పేరు ఎగరగొట్టేస్తున్నారు.

కొత్త కార్డుల కోసం 4.4 లక్షల అప్లికేషన్లు

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మూడేండ్ల కింద టీఆర్ఎస్​ సర్కారు ప్రకటించింది. అప్పటివరకు రేషన్ కార్డు లేనివాళ్లు, కొత్తగా పెండ్లయినవాళ్లు, ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడ్డవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో అప్పట్లో సుమారు 4.4 లక్షల మంది రేషన్​కార్డు కోసం అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ కొత్త రేషన్​కార్డుల జారీని పెండింగ్​ లో పెట్టిన ప్రభుత్వం, ఇటీవల హుజూరాబాద్​ ఎన్నికల నేపథ్యంలో వాటి బూజు దులిపింది. కొత్తగా మరో 5 లక్షల మంది అప్లై చేసుకుంటారని భావించినా ఆన్​లైన్​లో ఆప్షన్​ తీసేసింది.  ప్రస్తుతానికి పాత అప్లికేషన్లలోనే అర్హులను గుర్తించే పనిలో ఆఫీసర్లు బిజీ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్​వేర్​ఉపయోగిస్తున్నారు. ఆధార్ ​కార్డు, పాన్​కార్డు, రైతుబంధు, ఆర్టీఏ సమాచారాన్ని 360 డిగ్రీ అనాలిసిస్​ విధానంలో అనలైజ్​ చేస్తున్నారు. గైడ్​లైన్స్​కు విరుద్ధంగా ఉన్న అప్లికేషన్లన్నీ ఆటోమేటిక్​గా రిజక్ట్​ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాసెస్​ జరిగిన జిల్లాల్లో సుమారు 20 నుంచి 30 శాతం అప్లికేషన్లు ఇలా పక్కనపెట్టడం గమనార్హం. జనగామ జిల్లాలో189, మంచిర్యాల 493, పెద్దపల్లి  86, కరీంనగర్ 1,800, భద్రాద్రి కొత్తగూడెం 800, మెదక్ లో 506, ఆసిఫాబాద్ లో 1,205, సిరిసిల్లలో 120  దరఖాస్తులను ఇప్పటివరకు రిజక్ట్ చేసినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. 

పకడ్బందీగా ఫీల్డ్​ఎంక్వైరీ 

360 డిగ్రీస్ అనాలసిస్​ తర్వాత కూడా అప్లికేషన్లను యథాతథంగా ఆఫీసర్లు ఆమోదించట్లేదు. వాటిని తహసీల్దార్లకు పంపించి, వీఆర్వోలు, ఆర్ఐల ద్వారా ఫీల్డ్​ ఎంక్వైరీ చేయిస్తున్నారు. వీరంతా అప్లికెంట్ల ఇండ్లకు వెళ్లి భూములు, ఇంటి వివరాలు, ఫోర్, టూ వీలర్ల సమాచారం, కరెంటు బిల్లు తీసుకుంటున్నారు. కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగముందా?  పింఛన్​ వస్తుందా? లాంటి వివరాలు సేకరిస్తున్నారు.  ఈ వివరాల తర్వాత కూడా అప్లికేషన్లు రిజక్ట్​ చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రేషన్​కార్డులు మంజూరు చేసినప్పుడు ఇలాంటి రూల్స్​లేవు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో అనర్హులకు రేషన్​కార్డులు దక్కాయనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వంపై విమర్శలు రావడంతో రేషన్​కార్డుల ఏరివేతకు స్పెషల్​ డ్రైవ్​లు నిర్వహించినా రాజకీయ కారణాల వల్ల ముందుకు సాగలేదు. తాజాగా కొత్త గైడ్​లైన్స్​ను కొత్త కార్డులకే పరిమితం చేస్తారా? అదే సాఫ్ట్​వేర్​ సాయంతో పాత కార్డులను ఏరివేస్తారా? అనే విషయంలో ఆఫీసర్లు ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వట్లేదు.

ఈసారీ మార్పులకు అవకాశం లేనట్లే.. 

కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారితో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పుచేర్పులకు ప్రభుత్వం అవకాశమివ్వట్లేదు. పాత కార్డులు జారీచేసి ఏండ్లు గడుస్తుండడంతో చాలా కుటుంబాల్లో పిల్లజెల్ల కలిగారు. వీళ్ల పేర్లు కార్డులో ఎక్కితే అదనపు రేషన్​ వచ్చేది. కానీ మార్పుచేర్పులకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆమేరకు నష్టపోతున్నామని ఆయా కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త రేషన్​ కార్డులకు అవకాశమిచ్చిన సర్కారు, మార్పుచేర్పులనూ చేయాలనే డిమాండ్​ వ్యక్తమవుతోంది.