కార్డుల్లేవ్..బియ్యం లేవ్!

కార్డుల్లేవ్..బియ్యం లేవ్!

భద్రాద్రి జిల్లా లో 18వేల మందికి నిరాశ
కొత్త రేషన్ కార్డు లు రాక..
బియ్యం పంపిణీకి నోచుకోక..
లాక్డౌన్ లో పూటగడవని పరిస్థితి
కార్డుల కోసం నెలల తరబడి ఎదురు చూపులు
ఆదుకోవాలని సర్కారును వేడుకుంటున్న అర్హులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లాక్​డౌన్ ​కారణంగా అటు కూలీ పనిలేక, ఇటు పూట
గడవక భద్రాద్రి జిల్లాలో చాలా మంది పస్తులుంటున్న పరిస్థతి. ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూసిన వారికి నిరాశే మిగులుతోంది. రేషన్ ​కార్డులు లేకపోవడంతో వారికి బియ్యం, నగదు పంపిణీ అందనిద్రాక్షగానే మారాయి. జిల్లాలో దాదాపు 18వేల మందికిపైగా రేషన్ ​కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. కార్డుల కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. ‘ఆన్​ లైన్​లో ప్రాబ్లం, సర్వర్​పనిచేయడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం లేదు’ అంటూ ఆఫీసర్లు కొత్త రేషన్ ​కార్డులను మంజూరు చేయలేదు.

రేషన్​ కార్డులు లేకపోవడంతో అన్ని అరత్హలున్నా లాక్​డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అందించే బియ్యాన్ని డీలర్లు వారికి పంపిణీ చేయడం లేదు. రేషన్​ కార్డు ఉన్న వారికే బియ్యం, నగదు పంపిణీ అని చెప్తుండడంతో కొత్తగా రేషన్ ​కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులు తలలు పట్టుకుంటున్నారు. ‘రేషన్​కార్డులేని వలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటోంది. మేమేం పాపం చేశాం. రేషన్ ​కార్డుకు అప్లై చేసుకొమ్మని ప్రభుత్వం చెప్పింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత వివిధ కారణాలతో కొన్ని నెలలుగా మంజూరు చేయకుండా ప్రభుత్వమే పెండింగ్​ పెట్టింది. ఇప్పుడేమో రేషన్​ కార్డు లేకపోవడంతో బియ్యం పోయడం లేదు. కూలిపని లేకపోవడంతో పూట గడవడం కష్టంగా ఉంది. నేను, నాకుటుంబం ఎట్లా బతకాలి?’ అంటూ కొత్తగూడెం పట్టణానికి చెందిన మహాలక్ష్మి అనే మహిళ వాపోయారు.

రేషన్ ​కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కార్డులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పలుమార్లు కలెక్ట‌ర్ సంబంధిత ఆఫీసర్లను ఆదేశించిన దాఖలాలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి రేషన్​కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి ప్రత్యేక కూపన్లు ఇచ్చి బియ్యంతో పాటు నగదు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. కాగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో తామేమీ చేయలేమని సివిల్ ​సప్లై ఆఫీసర్లు అంటున్నారు.

రేషన్ కార్డు లేదు..బియ్యంరాలే

కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఏడాది దాటింది. ఇప్పటి వరకూ కార్డు రాలేదు. కూలి పని
చేసుకుని బతుకుతున్నాం. లాక్ డౌన్ తో చేసుకుందామంటే పని కూడా లేదు. రేషన్
కార్డు లేకపోతే ప్రభుత్వం ఇచ్చే బియ్యం, రూ.1500 ఇవ్వరంట. ఇప్పుడు మేమేం తిని
బతుకాలే. – జీ స్వాతి, టేకులపల్లి