
- నాలుగు రోజులుగా సర్వర్ ప్రాబ్లమ్
- ఫోన్లు చేస్తున్నా స్పందించని టెక్నిషీయన్లు
- మరో నాలుగు రోజులు సమస్య తప్పదంటున్న ఆఫీసర్లు
మహబూబ్‌నగర్, వెలుగు: సర్వర్ప్రాబ్లంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోతోంది. ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు కావడం, బ్యాంకు లావాదేవీలు, ఈ చలాన్ చెల్లింపులు ఎక్కువగా జరుగుతుండడంతో సర్వర్ డౌన్అవుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్షాపుల్లోని బయోమెట్రిక్, ఐరిస్మిషన్లు పని చేయడం లేదు. లబ్ధిదారుల డీటెయిల్స్ఎంట్రీ చేస్తున్నా, ఓకే కావట్లేదు. దీంతో మూడు, నాలుగు రోజులుగా రేషన్‌షాపుల ముందు క్యూలు పెరిగిపోతున్నాయి.
గంటకు మించి పనిచేస్తలే..
రేషన్‌షాపులను ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంచుతారు. కూలి, వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లకు ఈ టైం అయితేనే అనుకూలంగా ఉంటుంది. కానీ ఆ ఆరు గంటల వ్యవధిలో కేవలం గంట మాత్రమే సర్వర్పని చేస్తోంది. అదీ ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య డెడ్‌స్లోగా నడుస్తోంది. ఒక్కో లబ్ధిదారుడి వేలిముద్ర తీసుకోవడానికి పది నిమిషాలకు పైగా పడ్తోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు కనీసం ఆరుగురికి కూడా రేషన్ ఇయ్యలేని పరిస్థితి. దీంతో షాపుల ముందు క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. మరుసటి రోజు వచ్చినా ఇదే సమస్య ఎదురుకావడంతో డీలర్లను నిలదీస్తున్నారు. సర్వర్ ప్రాబ్లం ఉందని, ఉదయం 11 గంటలు దాటాక రావాలని చెబితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం తొమ్మిది దాటితే తాము కూలి, పొలం పనులకు వెళ్తామని, అప్పుడు ఎలా రావాలని అంటున్నారు. 11 గంటల తరువాత బియ్యం తీసుకుంటే తమకు ఆ రోజు పని మొత్తం పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని జిల్లాల్లో ఇదే సమస్య
మహబూబ్‌నగర్‌జిల్లా బాలానగర్, అడ్డాకుల, మిడ్జిల్, గండీడ్, మహ్మదాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల, ఆళ్లపల్లి, గుండాల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, ఆదిలాబాద్జిల్లాలోని మెజారిటీ మండలాలు, మహబూబాబాద్జిల్లా గంగారం, కొత్తగూడ మండలాల్లో రేషన్పంపిణీ బుధవారం దాదాపు నిలిచిపోయింది. ఖమ్మం, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, నల్గొండ, సంగారెడ్డి, వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లోని రేషన్‌షాపుల్లో కూడా సోమ, మంగళవారాల నుంచి ఈ సమస్య కంటిన్యూ అవుతోంది. సూర్యాపేట జిల్లాలోనూ ఇదే సమస్య ఉండడంతో మంగళవారం అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు డీలర్లు వినతిపత్రాలు ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఇదే సమస్యపై పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌కు రేషన్‌డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు వినతిపత్రం అందజేశారు. లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వస్తున్నందున వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరారు.
బెంగళూర్ నుంచే ప్రాబ్లం
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఒకే సర్వర్నుంచి రన్అవుతుండడంతో తరచూ సమస్య వస్తోంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్ఎండింగ్కావడంతో బ్యాంకు లావాదేవీలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఈ చలానాలు, ఇతర లావాదేవీలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలో సర్వర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో తరచూ డౌన్ అవుతోంది. ఈ విషయంపై ఆయా జిల్లాల సివిల్సఫ్లై ఆఫీసర్లు రెండు రోజులుగా బెంగళూరులోని సర్వర్సెంటర్నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే సమస్య పరిష్కారానికి మరో నాలుగు రోజులు టైం పడుతుందని అక్కడి టెక్నిషీయన్లు చెబుతున్నట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. పాలమూరులో కొందరు డీలర్లకు టెక్నిషీయన్లు ఫోన్లో అందుబాటులోకి వస్తున్నా, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు
శుక్రవారం వరకు క్లియర్ అవుతుంది
ఫైనాన్షియల్ఇయర్ఎండింగ్కావడంతో ఈ చలాన్ల చెల్లింపులు, బ్యాంక్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. గవర్నమెంట్మొత్తానికి ఒకే సర్వర్కావడంతో బిజీ వస్తోంది. దీంతో సర్వర్డౌన్అవుతుండటం వల్ల రేషన్ షాపుల వద్ద సమస్యలు వస్తున్నాయి. ఫ్రైడే వరకు ఈ సమస్య ఉంటుందని అంటున్నరు. రేషన్ బియ్యం పంపిణీ పర్సంటేజీని చూసి, బియ్యం పంపిణీకి ఎక్స్టెండ్డేట్అడుగుతాం. - కె.వనజాత, డీఎస్వో, మహబూబ్‌నగర్
గంటే వస్తోంది
సర్వర్ ప్రాబ్లం మూడు రోజులుగా ఉంది. దీనిపై కంప్లైంట్ చేస్తున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. చాలా ఇబ్బంది పడుతున్నం. కేవలం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకే సర్వర్ వస్తోంది. అది కూడా స్లోగా. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంది. అందుకే షాపును బంద్పెట్టిన.
–లక్ష్మీనరసింహ, రేషన్ డీలర్, అడ్డాకుల
ప్రజలు తిడుతుండ్రు
మూడు రోజుల నుంచి సర్వర్ సతాయిస్తోంది. కనీసం పది మందికి కూడా బియ్యం ఇయ్యలేకపోతున్నం. లబ్ధిదారులు పొద్దున వచ్చి సాయంత్రం దాకా దుకాణాల ముందట ఎండకు నిలబడి అలసిపోయి వాపస్ పోతుండ్రు. ఆఫీసర్లకు ఫోన్ చేసి అడిగితే ఏం చెప్తలేరు. మేము ప్రజలకు ఏం చెప్పిన వింటలేరు. మమ్మల్ని తిట్టుకుంట పోతుండ్రు.
–కుశ్నపల్లి అనసూర్య, రేషన్ డీలర్, లక్సెట్టిపేట