
- సన్నబియ్యం లబ్ధిదారుల ఇండ్లలో నేతలు, ఆఫీసర్ల భోజనం
- మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. కలెక్టర్ వరకు ఇదే తీరు
- ఆతిథ్యమిచ్చిన లబ్ధిదారులకు ఆత్మీయ సన్మానం
- పాత రోజులను గుర్తు చేసుకుంటున్న లబ్ధిదారులు
వరంగల్, వెలుగు: “ మోదుగు ఆకుతో చేసిన ఇస్తరాకు లేదంటే అరిటాకు.. రాష్ట్ర సర్కారు పంపిణీ చేసిన సన్నబియ్యంతో వండిన వేడి వేడి బువ్వ.. ఒకచోట ముద్ద పప్పు, మరోచోట పప్పు, పాలకూర, పచ్చి పులుసు.. నేలపై కూర్చోని సహపంక్తి భోజనం..” నెల రోజులుగా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా అధికారుల వరకు సన్నబియ్యం లబ్ధిదారుల ఇండ్లలో ఆతిథ్యానికి వెళ్తుండగా అందరిని ఆకట్టుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ స్కీమ్ ను సీఎం రేవంత్‍రెడ్డి ఉగాది రోజు ప్రారంభించారు. గత నెల 1 నుంచి ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నారు. పేద కుటుంబాలకు ఎంతో మేలు కలిగించే పథకం సక్సెస్ అయింది. సన్నబియ్యం లబ్ధిదారుల ఇండ్లల్లో భోజనానికి వెళ్తుండడంతో కాలనీల్లో పండుగ సందడి కనిపిస్తోంది.
పాత రోజులను గుర్తు చేసుకుంటూ..
సన్నబియ్యం లబ్ధిదారుల ఇండ్లకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భోజనానికి వెళ్లినచోట నలభై, యాభై ఏండ్లనాటి రోజులను గుర్తు చేస్తున్నారు. ఇస్తరాకులో అన్నం వడ్డించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్లు మారాయి. అయినా.. సన్నబియ్యం అన్నంలోకి ముద్ద పప్పు, పాలకూర పప్పు , పచ్చిపులుసు ప్రధానంగా ఉంటోంది. కొన్నిచోట్ల ఆతిథ్యమిచ్చిన పేదలు.. లీడర్ తమ ఇంటికి భోజనానికి వస్తుండని నాటుకోడి వంట చేసి సర్‍ప్రైజ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా నేలపైన లబ్ధిదారులు, కాలనీవాసులతో కలిసి కూర్చొని తింటున్నారు.
కార్యక్రమం జరిగిన ప్రతి చోట వినిపించే మాట ఏంటంటే.. “ ఎన్నిరోజులైందో ఇలా ఇస్తరాకుల్లో అన్నం తినక.. నలుగురితో కలిసి ఇలా కిందకూర్చోని భోజనం చేయక. ఎంతైనా పాత రోజులు పాత రోజులే..” అంటూ గుర్తు చేసుకుంటున్నారు. “ అక్కా.. నీ చేతి వంట మస్త్ ఉంది. తింటాంటే మరో రెండు బుక్కలు తినాలనిపిస్తోంది”.. అనడంతో.. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ రీత్యా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వేర్వేరు ఆహారపు అలవాట్లు కలిగిన కలెక్టర్లు కూడా పప్పు, పచ్చి పులుసు కాంబినేషన్‍కు ఫిదా అవుతున్నారు. చివర్లో లీడర్లు.. తమను ఇంటి భోజనానికి పిలిచిన లబ్ధిదారులకు ఆత్మీయ సన్మానాలు చేస్తుండటంతో సన్నబియ్యం భోజన కార్యక్రమాలు మారుమూల పల్లెల్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.