పెనుబల్లి, వెలుగు: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న లారీని ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆంధ్రకు చెందిన ఓ వ్యాపారి మండలంలోని పలు గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి ముత్తగూడెం–కుప్పెనకుంట్ల గ్రామాల మధ్య ఉన్న మామిడి తోటలో దాచిపెట్టాడు.
శుక్రవారం ఉదయం లారీలో బియ్యాన్ని లోడ్ చేసి సీతారామపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే మార్గంగా ఏపీకి తరలించేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న వీఎం బంజర్ పోలీసులు గ్రీన్ ఫీల్డ్ హైవేపై లారీని చేజ్ చేసి పట్టుకున్నారు. లారీలో సుమారు 35 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీని సీజ్ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్సై వెంకటేశ్‌తెలిపారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో 207 బస్తాలు సీజ్..
మరిపెడ: మరిపెడ మండల పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నంబర్-13 కేంద్రంగా రహస్యంగా సాగుతున్న రేషన్ బియ్యం దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పీడీఎస్ బియ్యాన్ని ఇక్కడ భారీగా డంప్ చేయగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర గౌడ్, హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు తనిఖీలు నిర్వహించారు. ఈ ఇంటిని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిరాయికి తీసుకుని దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. 207 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి గోడౌన్‌కు తరలించారు.
