పంచాయతీలై మూడేండ్లయినా రేషన్​షాపులు పెట్టలె

పంచాయతీలై మూడేండ్లయినా రేషన్​షాపులు పెట్టలె
  • ఆరేండ్లయినా రేషనలైజేషన్‌ అమలు కాలే
  • 4,380 కొత్త పంచాయతీలకు షాపుల ప్రపోజల్స్ బుట్టదాఖలు
  • ఖాళీగా ఉన్నవే భర్తీ చేయాలని తాజాగా సర్కారు ఆదేశాలు

నల్గొండ, వెలుగు: రేషన్‌ షాపులను ప్రక్షాళన చేస్తామని ఆరేండ్ల కిందట చెప్పిన సర్కారు దాన్ని మూలకు పడేసింది. ప్రతి కొత్త పంచాయతీలోనూ షాపులు ఏర్పాటు చేస్తామని మూడేండ్ల కిందట ప్రకటించి దాన్నీ పక్కనబెట్టింది. 4,380 కొత్త రేషన్‌ షాపుల కోసం ప్రపోజల్స్‌ తీసుకొని అవీ అటకెక్కించింది. తండాల్లో కిలోమీటర్‌కో షాపు పెట్టాలని, 500 కార్డులు దాటితే మరో షాపు ఏర్పాటు చేయాలని తీసుకొచ్చిన గైడ్‌లైన్స్‌ ఏవీ అమలు చేయలేదు. తాజాగా.. ఇప్పటికే ఉన్న వాటిల్లో ఖాళీ అయిన షాపు లనే (క్లియర్‌ వేకెన్సీలు) భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.  కరోనా టైమ్‌లో రేషన్‌ కోసం వేరే ఊర్లకు వెళ్లాల్సి వస్తోందని.. కొత్త షాపులు పెట్టాలని జనం డిమాండ్‌ చేస్తున్నారు.    

2015లోనే ప్రక్షాళన అన్నరు
టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని భావించింది. కొత్త షాపుల ఏర్పాటుకు 2015లోనే విధివిధానాలు ఖరారు చేసింది. అప్పుడున్న పాత జిల్లాలు ప్రామాణికంగా ప్రతిపాదనలను ప్రభుత్వానికి సివిల్ సప్లై ఆఫీసర్లు పంపారు. 2018లో 500 జనాభా దాటిన తండాలను, కొన్ని ఆవాస ప్రాంతాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. పంచాయతీలు వచ్చాక  ఊర్లోనే రేషన్‌షాపు ఏర్పాటు చేస్తారని జనం ఆశపడ్డారు. అందుకు తగ్గట్లే కొత్త పంచాయతీల్లో రేషన్​షాపులు ఏర్పాటు చేస్తామని సర్కారు కూడా ప్రకటించింది. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4,380 గ్రామాల్లో కొత్త రేషన్‌ షాపుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. కానీ ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క కొత్త షాపు గాని, కొత్త కార్డుగాని ఇవ్వలేదు. తాజాగా కొత్త కార్డులు ఇస్తామని సర్కారు ప్రకటించడంతో రేషన్​షాపుల ఏర్పాటుపై మరోసారి చర్చ జరుగుతోంది.

కొత్త షాపులతో కిరికిరి వస్తదని
కొత్త షాపుల అంశాన్ని కదిలిస్తే లేనిపోని చిక్కులు వస్తాయని క్లియర్ వేకెన్సీలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త షాపుల ఇష్యూ కోర్టులో ఉందని డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు కొత్త షాపులు ఏర్పాటు చేయాల్సి వస్తే ఎక్కువగా తండాలే ఉన్నాయి. స్టేట్‌లో పంచాయతీలుగా మారిన వాటిలో సుమారు 1,300 తండాలే. జనాభా లెక్కన చూస్తే తండాల్లో కొత్త షాపుల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని డీలర్లంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం అలా ఆలోచిస్తే తమకు కమీషన్ కాకుండా నెలనెలా జీతాలు ఇవ్వాలని డీలర్లు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఒక్కో షాపు పరిధిలో కనీసం 500  నుంచి వెయ్యి వరకు కార్డులున్నాయి. 500కు మించి కార్డులున్నచోట సమస్యలు వస్తున్నాయి. ఆయా చోట్ల రేషన్​పంపిణీకి సగం నెల గడిచిపోతోంది. కరోనా వల్ల ఫిజికల్​ డిస్టెన్స్ మెయింటెన్​ చెయ్యలేని పరిస్థితి. దీంతో వీటిన్నింటినీ రేషనలైజేషన్ చేసి షాపుల వారీగా కార్డుల సంఖ్యను తగ్గిస్తే ప్రజాపంపిణీ వ్యవస్థ ఈజీ అవుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు.

క్లియర్ వేకెన్సీలే భర్తీ
కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ఇటీవల చెప్పిన సర్కారు, కొత్త రేషన్​ షాపులపై మాత్రం ప్రకటన చేయలేదు. జిల్లాల్లోని  1,454  క్లియర్ వేకెన్సీలు భర్తీ చేయాలని జిల్లా ఆఫీసర్లను ఆదేశించింది. ఇప్పటికే ఉన్న రేషన్​షాపుల డీలర్లలో ఎవరైనా మరణించినా, బాధ్యతల నుంచి తప్పుకున్నా వాటిని క్లియర్​ వేకెన్సీలంటారు. ఆ షాపులను ప్రస్తుతం ఇన్‌చార్జులు నడిపిస్తున్నారు. దీని వల్ల కార్డుదారులు ఇబ్బంది పడ్తున్నారని, ప్రజాపంపిణీ వ్యవస్థ దెబ్బ తింటోందని భావించిన ప్రభుత్వం ఈ  క్లియర్ వేకెన్సీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. రిజర్వేషన్లు ఫైనల్ చేసి త్వరగా డీలర్లను అపాయింట్ చేయాలని ఆర్డీవోలను ఆదేశించింది. కానీ కొత్త షాపుల ప్రస్తావన లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

ఆరేండ్ల కిందటే గైడ్​లైన్స్
కొత్తగా ఏర్పాటైన గ్రామాల్లో రేషన్​షాపులు ఏర్పాటు చేయాలంటే ముందుగా రేషనలైజేషన్ కార్యక్రమం చేపట్టాలి. దీనికోసం 2015లోనే సర్కారు గైడ్ లైన్స్ ఇచ్చింది. వీటి ప్రకారం గిరిజన తండాల్లో ఒక కిలోమీటరు.. గ్రామాలు, మున్సిపాలిటీల్లో మూడు కిలోమీటర్లు దాటితే కొత్త షాపులు ఉండాలని ప్రతిపాదించారు. వీటితో సంబంధం లేకుండా 500 కార్డులు దాటితే కొత్త షాపు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు కావడం, ఇది జరిగిన మూడేళ్లకే కొత్త పంచాయతీలు ఏర్పడటంతో పాత ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలయ్యాయి.