కరోనా కోరల్లో రేషన్‌‌‌‌ డీలర్లు

కరోనా కోరల్లో రేషన్‌‌‌‌ డీలర్లు
  • హాస్పిటల్​ ఐసోలేషన్​లో మరో 520 మంది
  • ఐరిస్, బయోమెట్రిక్​కు ప్రత్యామ్నాయం చూపట్లే 
  • కొవిడ్​ భయంతో ఈ నెల లేటయిన పంపిణీ
  • వచ్చే నెల షాపులు తెరవబోమని సర్కారుకు అల్టిమేటం

జయశంకర్‌‌‌‌  భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో కరోనా మహమ్మారి రేషన్‌‌‌‌ డీలర్లను బలి తీసుకుంటున్నది. స్టేట్​వైడ్​ఇప్పటికే 136 మంది డీలర్లు కొవిడ్​తో మృతిచెందారు. ఇంకా 520 మందికి పైగా డీలర్లు హాస్పిటల్​ఐసోలేషన్ లో ఉన్నారు. కొవిడ్‌‌‌‌‒19 కారణంగా రాష్ట్రంలో నిత్యం ఏదో చోట రేషన్‌‌‌‌ డీలర్లు చనిపోతుండడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. రేషన్‌‌‌‌ షాపుల్లో లబ్ధిదారుల వేలిముద్రలు, ఐరిస్​ తీసుకునే క్రమంలో డీలర్లు కొవిడ్​ బారిన పడుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయం చూపాలని, థర్డ్‌‌‌‌ పార్టీ అథెంటికేషన్‌‌‌‌కు అనుమతించాలని కొవిడ్​ ఫస్ట్​ వేవ్​టైమ్​నుంచి డీలర్లు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. సెకండ్​వేవ్​ తీవ్రంగా ఉండడంతో ఇటీవల రేషన్​ డీలర్ల యూనియన్ ​ఆధ్వర్యంలో సివిల్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఛైర్మన్‌‌‌‌, కమిషనర్​ను కలిసి రిప్రజెంటేషన్​ఇచ్చారు. స్పందన లేకపోవడంతో ఈ నెల మొదటివారం చాలా జిల్లాల్లో రేషన్ పంపిణీ చేయలేదు. పబ్లిక్​ ఒత్తిడితో రెండో వారం నుంచి పంపిణీ చేస్తున్నా, ఇప్పటికీ  ప్రభుత్వం స్పందించకపోతే ​వచ్చే నెల నుంచి షాపులు తెరవబోమని డీలర్లు తేల్చి చెబుతున్నారు.

1250 కి పైగా షాపుల్లో ఇన్​చార్జిల ద్వారా..  ‌‌
రాష్ట్రంలో16,987 రేషన్​ షాపులు ఉన్నాయి. 87.42 లక్షల కార్డుదారులుండగా 2.79 కోట్ల యూనిట్స్‌‌‌‌ ఉన్నాయి. రూల్స్​ప్రకారం ప్రతీ నెలా 5 నుంచి 15వ తేదీ లోపు రేషన్‌‌‌‌ షాపుల్లో సరుకులు ఇవ్వాలి. కొవిడ్​ కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 136 మంది రేషన్‌‌‌‌ డీలర్లు మృతిచెందారు. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 22 మంది మరణించారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో 10 మందికి తగ్గకుండా చనిపోయారు. మరో 520 మంది కరోనా వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా 500 కు మించి రేషన్​డీలర్ల కుటుంబాల్లో ఒకరు, అంతకంటే ఎక్కువ మంది హోం ఐసోలేషన్​లో ఉన్నారు.  దీంతో ఈ 1,250  రేషన్‌‌‌‌ షాపుల్లో ఈ నెల ఇన్​చార్జిల ద్వారానే ఆఫీసర్లు సరుకులు పంపిణీ చేయించారు. ఈ ఇన్​చార్జిలు టైంకు రేషన్‌‌‌‌ షాపులు తెరవకపోవడం, టెక్నికల్​ప్రాబ్లమ్స్​వస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలా జిల్లాల్లో ఇంకా రేషన్​పంపిణీ కొనసాగుతూనే ఉంది. 

సర్కారు నిర్లక్ష్యం వల్లే డీలర్లకు కరోనా
రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో రేషన్‌‌‌‌ డీలర్లు కొవిడ్​బారిన పడడానికి, చనిపోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూల్స్​ప్రకారం ప్రతి నెలా 5 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు రేషన్‌‌‌‌ షాపు తెరిచే ఉంచాలి. రోజుకు కనీసం వంద మందికి పైగా లబ్ధిదారులు షాపులో బియ్యం, సరుకులు తీసుకెళ్తారు. డీలర్‌‌‌‌ ప్రతి ఒక్కరి నుంచి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ ఓటీపీ తీసుకోవడం, బయోమెట్రిక్​లో థంబ్​వేయించడం లేదంటే ఐరిస్​తీసుకోవడం చేయాలి. చాలా మందికి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ లో  ఓటీపీ చూడడం రాదు. దీంతో డీలర్‌‌‌‌ వాళ్ల సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ తీసుకొని ఓటీపీ చూడాల్సి వస్తోంది. ఒకే  బయోమెట్రిక్, ఐరిస్ మిషన్​ను ఉపయోగించడం వల్ల వాటి ద్వారా డీలర్లకు కరోనా సోకుతోంది. రేషన్‌‌‌‌ షాపులకు వస్తున్నవారిలో ఎవరికి కొవిడ్​ ఉందో, ఎవరికి లేదో తెలియడం లేదు. ఒకేసారి లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో వస్తే  ఫిజికల్​డిస్టెన్స్​పాటించడం లేదు. రేషన్‌‌‌‌ డీలర్లకు ప్రభుత్వం ఎలాంటి పీపీఈ కిట్లు అందించలేదు. దీంతో రేషన్‌‌‌‌ డీలర్లు కరోనా బారిన పడుతున్నారు.
 
మంత్రి, చైర్మన్‌‌, కమిషనర్​కు మొరపెట్టుకున్నా.. 
రేషన్‌‌‌‌ డీలర్లు కొవిడ్ ​బారిన పడి మరణిస్తుండటంతో ఆ యూనియన్‌‌‌‌ నాయకులు పలుసార్లు థర్డ్‌‌‌‌ పార్టీ అథెంటికేషన్‌‌‌‌ కోసం రాష్ట్ర సివిల్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ మినిస్టర్​గంగుల కమలాకర్, సివిల్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ శాఖ చైర్మన్​మారెడ్డి శ్రీనివాస్‌‌‌‌తో పాటు ఆ శాఖ కమిషనర్‌‌‌‌కు వినతిపత్రాలు అందించారు. రేషన్‌‌‌‌ కార్డుదారుల నుంచి వేలిముద్రలు, ఐరిస్​ తీసుకోకుండా సరుకుల పంపిణీకి అనుమతించాలని, ఇందుకోసం గవర్నమెంట్‌‌‌‌ తరపున ఒక ఉద్యోగిని ప్రతి రేషన్‌‌‌‌ షాపులో నియమించాలని విజ్ఞప్తి చేశారు. కానీ దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో డీలర్ల యూనియన్‌‌‌‌ ఆధ్వర్యంలో తాజాగా హైకోర్టులో పిల్ వేశారు. నేడో, రేపో ఈ పిల్‌‌‌‌పై హైకోర్టులో విచారణ జరగనున్నట్లు యూనియన్‌‌‌‌ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వచ్చే నెల నుంచి రేషన్‌‌‌‌ షాపులు బంద్‌‌‌‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జిల్లాలవారీగా ఈమేరకు యూనియన్లు తీర్మానించినట్లు డీలర్లు చెబుతున్నారు. 

థర్డ్‌‌‌‌ పార్టీ అథెంటికేషన్‌‌‌‌కు అనుమతివ్వాలి
సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ ఓటీపీ, ఐరిస్​ఆధారంగా సరుకులు పంపిణీ చేయడం వల్ల డీలర్లకు కరోనా సోకుతోంది. రేషన్‌‌‌‌ షాపుల్లో సరుకుల పంపిణీకి థర్డ్‌‌‌‌ పార్టీ అథెంటికేషన్‌‌‌‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఈ విషయమై సివిల్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ శాఖ మంత్రికి, చైర్మన్‌‌‌‌, కమిషనర్‌‌‌‌ లకు వినతిపత్రాలు ఇచ్చినం. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టులో కేసు వేశాం. 
‒బత్తుల రమేశ్‌‌‌‌ బాబు, రేషన్‌‌‌‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

మా ప్రాణాలు పోయినా లెక్కలేదా
కరోనా వ్యాధి బారిన పడి రేషన్‌‌‌‌ డీలర్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 136 మంది చనిపోయారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రేషన్‌‌‌‌ డీలర్లను కూడా ప్రభుత్వం కరోనా వారియర్స్‌‌‌‌గా గుర్తించాలి. కొవిడ్‌‌‌‌‒19 వల్ల చనిపోయిన డీలర్ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌‌‌‌గ్రేషియా ప్రకటించాలి. అలాగే ప్రతి డీలర్‌‌‌‌, వారి కుటుంబసభ్యుల పేరిట రూ.5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా చేయించాలి.  
‒రాధాకృష్ణ, రేషన్‌‌‌‌ డీలర్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు