ఎజెండాలో బనకచర్ల లేకుండా మీటింగా..? ఇవాళ(నవంబర్ 07) పీపీఏ మీటింగ్పై తెలంగాణ సీరియస్

ఎజెండాలో బనకచర్ల లేకుండా మీటింగా..? ఇవాళ(నవంబర్ 07) పీపీఏ మీటింగ్పై తెలంగాణ సీరియస్
  • నవంబర్ 07 న  పీపీఏ మీటింగ్.. 
  • పోలవరంతో ముంపు సహా వివిధ అంశాలపై చర్చ..
  •  బనకచర్లను ఎజెండాలో చేర్చాలని తెలంగాణ డిమాండ్​
  • ఇప్పటికీ స్పందించని పీపీఏ.. దానిపైనా నిలదీసేందుకు మన అధికారులు రెడీ

హైదరాబాద్​, వెలుగు: పోలవరం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​తో తెలంగాణలో ముంపు సహా వివిధ అంశాలపై పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీ (పీపీఏ) మీటింగ్​ను నిర్వహించనుంది. హైదరాబాద్​లోని సెంట్రల్​ వాటర్​ కమిషన్​ ఆఫీసులో గల కృష్ణా గోదావరి బేసిన్​ బిల్డింగ్​లో శుక్రవారం  (నవంబర్ 07)  ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అయితే, పోలవరం ముంపుతో పాటు ఏపీ చేపడుతున్న బనకచర్ల అంశంపైనా చర్చించాలని, అందుకు తగ్గట్టు ఎజెండాలో ఆ అంశాన్ని చేర్చాలని పీపీఏకి మన అధికారులు ఇటీవల లేఖ రాశారు. 

కానీ, పీపీఏ మాత్రం ఇప్పటివరకు దానిపై స్పందించలేదు. ఎజెండాలో ఆ అంశాన్ని చేర్చినా, చేర్చకపోయినా ఏపీ తీరును పీపీఏ ముందు ఎండగట్టాలని మన అధికారులు నిర్ణయించారు. దానిపై   సన్నద్ధమయ్యారు. ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ఇప్పటికే డీపీఆర్​ను తయారు చేసేందుకు టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే ఏపీకి అడ్డుకట్ట వేయాలని పీపీఏతో పాటు సీడబ్ల్యూసీకీ గత నెల 10నే మన అధికారులు ఫిర్యాదు చేశారు. ఇటు కృష్ణా, గోదావరి బోర్డులు ఏపీ డీపీఆర్​ టెండర్​పై అభ్యంతరాలనూ వ్యక్తం చేశాయి. వారంలో వివరణ ఇవ్వాలని లేఖ రాసి నెలవుతున్నా ఇప్పటికీ ఏపీ నుంచి రెస్పాన్స్​ రాలేదు. దీంతో ఏపీ తీరును గట్టిగా ఎండగట్టాలని మన అధికారులు నిర్ణయించారు. 

పోలవరంపై ఇవీ మన అభ్యంతరాలు..!

పోలవరం ప్రాజెక్టును వాస్తవానికి 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. అయితే, ఆ ఎత్తుతో నిర్మించి పూర్తిస్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్​తో ముంపు మరో 53,393 ఎకరాలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరపగా.. ప్రాజెక్టును పూర్థిస్థాయి సామర్థ్యంతో నిర్మించినా కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసేలా కేంద్రం నిర్ణయించింది. అందుకు తగ్గట్టు 15,277.84 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంది. 

ఆ ఎత్తులోనూ నీటిని స్టోర్ చేస్తే మన దగ్గర 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపుకు గురికానున్నాయి. దాంతోపాటు భద్రాచలం టౌన్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లకూ ముంపు ముప్పు పొంచి ఉంది. కిన్నెరసాని, ముర్రేడువాగుతో పాటు మరో ఆరేడు స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత ఎక్కువ అవుతుందన్న ఆందోళన ఉన్నది. 

దుమ్మగూడెం ప్రాజెక్టు కింద 36 వాగులు వచ్చి చేరుతుండడంతో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వాటి డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఈ క్రమంలోనే ముంపుకు సంబంధించి కచ్చితంగా సర్వే చేయించి డీమార్కేషన్ చేయించాలని తెలంగాణ పట్టుబడుతున్నది. కానీ, ఏపీ మాత్రం జాయింట్ సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేసింది.