రాత్రంతా స్టూడెంట్లు జాగారం

రాత్రంతా  స్టూడెంట్లు జాగారం
  • స్టూడెంట్లను కరిచిన ఎలుకలు
  • ఖమ్మం జిల్లా గాంధీనగరం ట్రైబల్​వెల్ఫేర్ గురుకులంలో ఘటన

కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గాంధీనగరం ట్రైబల్​ వెల్ఫేర్​ గురుకులంలో నిద్రపోతున్న ఐదుగురు స్టూడెంట్లను బుధవారం రాత్రి ఎలుకలు కరిచినయి. టెన్త్​క్లాస్ ​చదువుతున్న సుధీర్, కుమార్, రామచంద్రు, మోక్షజ్ఞ, సాయి అనే ఐదుగురి స్టూడెంట్ల చేతులు, కాళ్లను ఎలుకలు కొరికాయి. దీంతో వారు నిద్రపోకుండా రాత్రంతా జాగారం చేశారు. ఉదయం ప్రిన్సిపల్ ​ఐదుగురిని తీసుకెళ్లి టీటీ ఇంజక్షన్లు వేయించి చేతులు దులుపుకున్నారు. పుస్తకాలు, పెట్టెలు, బట్టలు, టీచింగ్​అన్ని క్లాసురూమ్​లోనే కావడంతో ఎలుకలు ఎక్కువై, రాత్రిళ్లు నిద్రపోనివ్వడం లేదని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్టూడెంట్స్​గురువారం ఆందోళనకు దిగారు.

ఇల్లందు- ఖమ్మం ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. యూత్​ కాంగ్రెస్​వారికి మద్దతు తెలిపింది. ఎలుక కాటువల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఎన్ని సార్లు చెప్పినా ప్రిన్సిపల్​పట్టించుకోవడం లేదని​ఆరోపించారు. గురుకులంలో కనీస సౌకర్యాలు లేవని, మెనూ ప్రకారం భోజనం కూడా పెట్టడం లేదన్నారు. గురుకులంలో 540 మంది స్టూడెంట్స్​కు కేవలం12 డార్మెటరీలు మాత్రమే ఉన్నాయని, ఒక్కో డార్మెటరీలో 25 మందికే చోటు ఉంటే, 40 మందికి పైగా పడుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

కారేపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని స్టూడెంట్స్​ను స్కూల్​లోకి పంపి యూత్​కాంగ్రెస్​ లీడర్లను స్టేషన్​కు తరలించారు. కాగా, స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్​ నాయకులు సీఐ ఆరిఫ్​ అలీఖాన్​కు ఫిర్యాదు చేశారు.