RT77 Movie: రవితేజ బర్త్‌డే బ్లాస్ట్.. ‘ఇరుముడి’ టైటిల్‌తో కొత్త సినిమా అనౌన్స్.. డైరెక్టర్ ఎవరంటే?

RT77 Movie: రవితేజ బర్త్‌డే బ్లాస్ట్.. ‘ఇరుముడి’ టైటిల్‌తో కొత్త సినిమా అనౌన్స్.. డైరెక్టర్ ఎవరంటే?

మాస్ మహారాజా రవితేజ ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను దక్కించుకుని ఆడియన్స్‌ను అలరించింది. ఈ క్రమంలోనే మరో కొత్త సినిమా అనౌన్స్ చేసారు రవితేజ. సోమవారం (జనవరి 26, 2026) రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన 77వ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ విడుదలైంది. ఈ మేరకు సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఇరుముడి’ (Irumudi) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ పేరు, సినిమాలో ఆధ్యాత్మికతతో కూడిన బలమైన కథ ఉండబోతోందని స్పష్టం చేస్తోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ మునుపెన్నడూ చూడని లుక్‌లో దర్శనమిస్తున్నారు. అయ్యప్ప మాల ధరించి, భక్తి పరవశ్యంలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్న రవితేజ చుట్టూ భక్తులు, ఊరేగింపు వాతావరణం ప్రత్యేకమైన ‘ట్రాన్స్’ ఫీలింగ్‌ను కలిగిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా, రవితేజ తన భుజంపై ఒక చిన్న పాపను ఎత్తుకుని ఉండటం గమనార్హం.

పోస్టర్ చూస్తుంటే, ఈ సినిమాలో తండ్రి–కూతురు మధ్య భావోద్వేగ బంధం కీలకంగా ఉండబోతోందని అర్థమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, రవితేజ కెరీర్‌లో ఒక విభిన్నమైన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనుందని ఫస్ట్ లుక్‌నే చెబుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై రవితేజ తన ఉత్సాహాన్ని తెలియజేస్తూ, “కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి” అంటూ రవితేజ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. 

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు 'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' వంటి హృదయాన్ని తాకే చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. శివ నిర్వాణ గతంలో ఎక్కువగా ఫ్యామిలీ, ఎమోషనల్ లవ్ స్టోరీలను తెరకెక్కించారు.

అయితే, ఈసారి మాత్రం తన మార్క్ శైలిని పక్కన పెట్టి.. ఓ పవర్‌ఫుల్ డివోషనల్ థ్రిల్లర్ స్టోరీతో వస్తున్నారు. ఈ సందర్భంగా రవితేజ-శివ నిర్వాణ కాంబో: టాలీవుడ్‌లో ఇది సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇకపోతే, ఈ మూవీలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సాయి కుమార్, అజయ్ ఘోష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో రూపొందుతున్న ‘ఇరుముడి’, రవితేజకు ఎలాంటి సక్సెస్ అందించనుందో అనే ఆసక్తి పోస్టర్ క్రియేట్ చేసింది.