Ravichandran Ashwin: నా ప్రామిస్ నిలబెట్టుకున్నా.. టెస్టులకు గుడ్ బై చెప్పడానికి అసలు కారణం చెప్పిన అశ్విన్

Ravichandran Ashwin: నా ప్రామిస్ నిలబెట్టుకున్నా.. టెస్టులకు గుడ్ బై చెప్పడానికి అసలు కారణం చెప్పిన అశ్విన్

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫామ్ లో ఉన్న ఈ ఆఫ్ స్పిన్నర్ సడన్ గా ఎందుకు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడనే విషయం సస్పెన్స్ గానే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. దీంతో అద్భుతమైన టెస్ట్ కెరీర్ కు ముగింపు పడింది. ఇంతకు అశ్విన్ టెస్టులకు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడో అసలు విషయం చెప్పుకొచ్చాడు. 

యు ట్యూబ్ ఛానెల్ లో అశ్విన్ మాట్లాడుతూ.. " స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి తర్వాత నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అంతకముందు స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలో 2012లో జరిగిన టెస్ట్ సిరీస్ లో 1-2 తేడాతో ఓడిపోయిన తర్వాత నేను మరింత బాధపడ్డాను. ఆ సిరీస్ తర్వాత మనం స్వదేశంలో మరో టెస్ట్ సిరీస్‌ను కోల్పోకూడదని నేను ప్రామిస్ చేసుకున్నా. స్వదేశంలో ఎప్పుడైతే ఇండియా సిరీస్ ఓడిపోతుందో అప్పుడు రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. నేను చేసుకున్న ప్రామిస్ పై నిలబడ్డాను". అని అశ్విన్ తెలిపాడు. 

టీమిండియాతో స్వదేశంలో మ్యాచ్ అంటే సిరీస్ కు ముందు ప్రత్యర్థి సగం ఆశలు వదులుకుంటుంది. 2012 లో ఇంగ్లాండ్ పై సిరీస్ ఓటమి తర్వాత 12 ఏళ్లుగా ప్రత్యర్థిని వణికిస్తూ ఒక్క సిరీస్ ఓడిపోకుండా విజయాలు సాధిస్తూ వచ్చింది. 2024లో న్యూజిలాండ్ పై సిరీస్ ఓడిపోవడంతో జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో సిరీస్ అనేసరికి మరో సిరీస్ ఖాతాలో వేసుకోవచ్చు అనుకున్నారు. అయితే సీన్ మొత్తం రివర్స్ అయింది. మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయింది. 2024 లో 0-3 తేడాతో న్యూజీలాండ్ తో సిరీస్ కోల్పోయిన మన జట్టు.. యదాహి తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాపై 0-2 తో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ అయింది.

అశ్విన్ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే భారత్ తరపున 106 టెస్టుల్లో 200 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేశాడు. 537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్ లోనూ మెరిసి 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 156 వికెట్లు.. 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇటీవలే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు.