Ravindra Jadeja: కోహ్లీకి కూడా సాధ్యం కాని రికార్డ్.. మూడేళ్లు నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా జడేజా సంచలనం

Ravindra Jadeja: కోహ్లీకి కూడా సాధ్యం కాని రికార్డ్.. మూడేళ్లు నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా జడేజా సంచలనం

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ చరిత్ర సృష్టించాడు. జడేజా 1,151 రోజుల పాటు టెస్ట్ క్రికెట్ చరిత్రలో నంబర్ 1 ఆల్ రౌండర్‌గా తన సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బుధవారం (మే 14) ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. 2022 నుంచి జడేజా టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు. మార్చి 9, 2022న జాసన్ హోల్డర్‌ను అధిగమించి టెస్టుల్లో టాప్ ఆల్ రౌండర్ గా నిలిచాడు. 

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఆల్ రౌండర్ ఇన్నేళ్ళపాటు నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగడం జడేజాకే సాధ్యమైంది. ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ఎన్నో రికార్డ్స్ నెలకొల్పోయిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో మూడేళ్లు కొనసాగలేదు. దిగ్గజ ఆల్ రౌండర్లు జాక్వెస్ కల్లిస్, ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్ లు మూడేళ్ళ పాటు వరుసగా నెంబర్ ఆల్ రౌండర్ గా కొనసాగలేకపోయారు. 36 ఏళ్ల జడేజా భారత టెస్ట్ జట్టుకు మూలస్తంభంగా మారాడు. టెస్ట్ క్రికెట్ లో లోయర్ ఆర్డర్ లో కీలక పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసేవాడు.  
 
మార్చి 2022 నుండి రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. ఈ మూడేళ్ళ కాలంలో 23 టెస్ట్ మ్యాచ్‌లలో బ్యాటింగ్ లో 36.71 సగటుతో 1,175 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లో తన గణాంకాలతో జడేజా ఆకట్టుకున్నాడు. 22.34 సగటుతో 91 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఘనత ఆరు సార్లు తీశాడు. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన సందర్భాలు రెండు ఉన్నాయి. 

ఓవరాల్ గా జడేజా టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 80 టెస్టుల్లో 118 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. 35 యావరేజ్ తో 3370 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే 150 ఇన్నింగ్స్ ల్లో 24 యావరేజ్ తో 323 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం, జడేజా ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో 400 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన మెహెది హసన్ మిరాజ్, దక్షిణాఫ్రికా మార్కో జాన్సెన్, ఆస్ట్రేలియాకు పాట్ కమ్మిన్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.