జడేజా అద్భుత పోరాటం వృథా..లార్డ్స్ టెస్టులో ఇండియా ఓటమి

జడేజా అద్భుత పోరాటం వృథా..లార్డ్స్ టెస్టులో ఇండియా ఓటమి
  • లార్డ్స్ టెస్టులో ఇండియా ఓటమి
  • 22 రన్స్‌‌‌‌తో గెలిచిన ఇంగ్లండ్‌‌‌‌
  • దెబ్బకొట్టిన ఆర్చర్‌‌‌‌‌‌‌‌, స్టోక్స్‌‌‌‌

లండన్‌‌‌‌: టీమిండియాకు హార్ట్ బ్రేక్. లార్డ్స్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ టెస్టులో ఇంగ్లండ్‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. సరిగ్గా ఆరేండ్ల కిందట వన్డే వరల్డ్ కప్ చాంపియన్స్‌‌‌‌గా నిలిచిన తేదీన అదే గ్రౌండ్‌‌‌‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆల్‌‌‌‌రౌండర్ రవీంద్ర జడేజా (181 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 61 నాటౌట్‌‌‌‌) అత్యద్భుత పోరాటంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురు నిలిచినా.. మిగతా బ్యాటర్లు నిరాశ పరచడంతో మూడో టెస్టులో ఇండియా 22 రన్స్ తేడాతో ఓడిపోయింది. చివరి రోజు, ఆదివారం 193 టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో  పేరున్న బ్యాటర్లంతా ఫెయిలైన వేళ టెయిలెండర్లతో కలిసి జడ్డూ అసాధారణ పోరాట పటిమ చూపెట్టాడు. ఆఖరి మూడు వికెట్లకు వరుసగా 30, 35, 23 భాగస్వామ్యాలతో ఆశలు రేపినా చివరకు ఇండియా 74.5 ఓవర్లకు 170 రన్స్‌‌‌‌కు ఆలౌటై విజయాన్ని చేజార్చుకుంది. రిషబ్ పంత్ (9), వాషింగ్టన్ సుందర్ (0), నితీశ్ రెడ్డి (13) ఫెయిల్యూర్ దెబ్బకొట్టింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (3/48), జోఫ్రా ఆర్చర్ (3/55) సూపర్ బౌలింగ్‌‌‌‌తో గొప్ప విజయాన్ని అందుకున్న ఇంగ్లిష్ టీమ్ ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 2–1తో ఆధిక్యం సాధించింది. స్టోక్స్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది. 

పంత్‌‌‌‌, సుందర్‌‌‌‌, నితీశ్‌‌‌‌‌‌‌‌ నిరాశ

ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 58/4తో ఛేజింగ్‌‌ కొనసాగించిన ఇండియా బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలించక, బాల్‌‌ అనూహ్యంగా బౌన్స్ అవుతున్న పిచ్‌‌‌‌పై తడబడింది. తొలి గంటలోనే ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌‌‌‌(39 నాటౌట్‌‌‌‌)తో పాటు కీలకమైన రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ వికెట్లు కోల్పోయి డీలా పడింది. దాదాపు నాలుగేండ్ల తర్వాత టెస్టు క్రికెట్‌‌‌‌లోకి రీఎంట్రీ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ ఇండియాను దెబ్బకొట్టాడు. తన బౌలింగ్‌‌‌‌లో పంత్ ఇబ్బందిపడ్డాడు. గాయపడిన వేలితో ఆడుతున్న పంత్..  ఆర్చర్ వేగాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఆర్చర్ వేసిన అద్భుతమైన బాల్‌‌‌‌కు పంత్ ఆఫ్ -స్టంప్ ఎగిరి పడింది. 

మరోవైపు వరుసగా తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఫామ్‌‌‌‌లో ఉన్న రాహుల్‌‌‌‌ను ఔట్ చేసి భారీ దెబ్బకొట్టాడు. అనూహ్యంగా లోపలికి దూసుకొచ్చిన బాల్‌‌‌‌కు రాహుల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇచ్చినా స్టోక్స్ డీఆర్ఎస్ తీసుకోవడంతో నిర్ణయం మారింది. తర్వాతి ఓవర్లోనే ఆల్‌‌‌‌రౌండర్ సుందర్.. ఆర్చర్‌‌‌‌‌‌‌‌ పట్టిన  చురుకైన రిటర్న్ క్యాచ్‌‌‌‌కు డకౌటవ్వడంతో 82/7తో నిలిచిన ఇండియా వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది.  పిచ్ కష్టంగా మారడంతో రవీంద్ర జడేజా,  నితీశ్‌‌‌‌ రెడ్డి ఎదురుదాడికి వెళ్లకుండా రక్షణాత్మకంగా ఆడుతూ స్కోరు వంద దాటించారు. కానీ, క్రీజులో కుదురుకున్న నితీశ్‌‌‌‌ లంచ్‌‌‌‌కు ముందు క్రిస్ వోక్స్ ఫోర్త్ స్టంప్‌‌‌‌పై వేసి బాల్‌‌‌‌ను వెంటాడి కీపర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇండియా 112/8తో లంచ్‌‌‌‌కు వెళ్లింది.

జడేజా ఆశలు రేపినా..

చేతిలో మరో రెండు వికెట్లే ఉండటంతో ఇండియా ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగదనిపించింది. కానీ, అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న జడేజా ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురు నిలిచాడు. మరో ఎండ్‌‌‌‌లో జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా (54 బాల్స్‌‌‌‌లో 5)ను నిలబెట్టి అద్భుతంగా పోరాడాడు. ఆతిథ్య బౌలింగ్‌‌‌‌ను గొప్పగా ఎదుర్కొంటూ.. ఒక్కో పరుగుతో జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌‌‌‌లో బుమ్రా డిఫెన్స్‌‌‌‌తో అతనికి సపోర్ట్ ఇచ్చాడు. ఈ ద్వయం 21 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి 35 రన్స్ జోడించింది.  ఓ దశలో147/8తో నిలవడంతో ఇండియాలో ఆశలు చిగురించాయి.

 కానీ, అప్పటిదాకా ఓపిగ్గా ఆడిన బుమ్రా.. స్టోక్స్‌‌‌‌ వేసిన ఊరించే షార్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ను గాల్లోకి లేపి క్యాచ్ ఔటవ్వడంతో తొమ్మిదో వికెట్‌‌‌‌కు 35 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. అయినా జడేజా పోరాటం ఆపలేదు. చివరి వికెట్‌‌‌‌గా వచ్చిన సిరాజ్ (30 బాల్స్‌‌‌‌లో 4) కూడా వికెట్‌‌‌‌ కాపాడుకునే ప్రయత్నం చేయగా.. 150 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జడ్డూ 163/9తో జట్టును టీ బ్రేక్‌‌‌‌కు తీసుకెళ్లాడు. రెండో సెషన్‌‌‌‌లో ఒకే వికెట్ కోల్పోయిన ఇండియా 51 రన్స్ రాబట్టింది. చివరి సెషన్‌‌‌‌లోనూ హైదరాబాదీ సిరాజ్‌‌‌‌ మంచి డిఫెన్స్‌‌‌‌తో వికెట్ కాపాడుకోవడంతో టీమిండియా మ్యాచ్ గెలిచి అద్భుతం సృష్టించేలా కనిపించింది. కానీ, చేతి వేలు విరిగినా లెక్క చేయకుండా బౌలింగ్‌‌‌‌కు దిగిన స్పిన్నర్ షోయబ్ బషీర్.. సిరాజ్‌‌ను బౌల్డ్ చేసి  ఇండియా హార్ట్‌‌‌‌ బ్రేక్ చేశాడు. అతని బాల్‌‌‌‌ను సిరాజ్ డిఫెండ్ చేయగా.. అది నేలపై పడి వెనక్కి వెళ్లి వికెట్లను తాకడంతో ఇంగ్లండ్ విజయసంబరాలు మొదలయ్యాయి.

 

జడ్డూను ఢీకొట్టి.. వెనక్కులాగి 

చివరి రోజు అద్భుతంగా పోరాడుతున్న జడేజా ఏకాగ్రత దెబ్బతీసేందుకు ఇంగ్లండ్‌‌‌‌ ప్లేయర్లు నోటికి పని చెప్పారు. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్.. జడ్డూతోపాటు నితీశ్ రెడ్డిని మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా జడ్డూ వెనక్కుతగ్గకపోవడంతో కార్స్‌‌‌‌ మరింత హద్దు మీరాడు. తను వేసిన 35వ ఓవర్ బాల్‌‌‌‌కు జడేజా పరుగు తీస్తుండగా కార్స్ అతడిని ఢీకొట్టాడు. ఈ క్రమంలో కార్స్ బ్యాలెన్స్ కోల్పోయి  కింద పడిపోతున్నట్టు నటిస్తూ కావాలనే జడేజా మెడ, భుజాన్ని  పట్టుకొని వెనక్కు లాగినట్టు కనిపించింది. రన్ పూర్తి చేసిన తర్వాత కార్స్‌‌‌‌పై జడేజా కోపంతో ఊగిపోయాడు.  కార్స్ కూడా అంతే దీటుగా బదులిచ్చాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 387 ఆలౌట్‌‌‌‌; 
ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 387 ఆలౌట్‌‌‌‌; 
ఇంగ్లండ్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌:   192 ఆలౌట్‌‌‌‌;  
ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌ (టార్గెట్ 193): 74.5 ఓవర్లకు 170 ఆలౌట్‌‌‌‌ ( జడేజా 61 నాటౌట్‌‌‌‌, రాహుల్ 39, బెన్ స్టోక్స్ 3/48,  జోఫ్రా ఆర్చర్ 3/55).

4 టెస్టుల్లో ఇండియా అతి తక్కువ రన్స్ తేడాతో ఓడిన నాలుగో మ్యాచ్ ఇది. 1999లో చెన్నై టెస్టులో పాక్ చేతిలో 12 రన్స్‌, 1977 బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ చేతిలో 16, 1987 బెంగళూరు మ్యాచ్‌లో 16 రన్స్ తేడాతో పాక్ చేతిలో ఓడిపోయింది.