Ravindra Jadeja: ఆ టోర్నీ ఆడాలని ఉంది.. కానీ నా చేతుల్లో ఏమీ లేదు: జడేజా

Ravindra Jadeja: ఆ టోర్నీ ఆడాలని ఉంది.. కానీ నా చేతుల్లో ఏమీ లేదు:  జడేజా

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కని సంగతి తెలిసిందే. అక్టోబర్ 19 నుంచి జరగనున్న ఈ మెగా సిరీస్ కు భారత స్క్వాడ్ ను శనివారం (అక్టోబర్ 4) అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మందితో కూడిన స్క్వాడ్ లో జడేజాను తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట జడేజాకు రెస్ట్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ సీనియర్ ఆల్ రౌండర్ ని తప్పించామని అగార్కర్ చెప్పాడు. దీంతో జడేజా వన్డే ఫార్మాట్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. 

ఆస్ట్రేలియాతో వన్డే జట్టు నుంచి తప్పించిన తర్వాత జడేజా తొలిసారి మనసు విప్పి మాట్లాడాడు. తనకు 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే కోరిక ఉందని వ్యక్తం చేశాడు. జడేజా మాట్లాడుతూ.. "  నేను 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నాను. కానీ అది నా చేతుల్లో లేదు నాకు ఆడాలనే ఉంది. కానీ చివరికి జట్టు మ్యానేజ్ మెంట్, సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్‌లకు వారి స్వంత ఆలోచనలు ఉంటాయి. ఈ సిరీస్‌కు నన్ను ఎందుకు ఎంపిక చేయలేదు? దాని వెనుక ఒక కారణం ఉండాలి. నేను ఎంపిక కాలేదని తెలుసుకున్నప్పుడు వారు నన్ను ఆశ్చర్యపరిచినట్లు కాదు". అని జడేజా విలేకరులతో అన్నాడు. 

ప్రస్తుతం జడేజా సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా సిరీస్ లో చోటు దక్కలేదు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపైనా జడేజా లాంటి అనుభవజ్ఞుడి అవసరం ఎంతైనా ఉంది. జడేజాను కాదని సుందర్, అక్షర్ కు ఛాన్స్ దక్కింది. చూస్తుంటే జడేజాను సైలెంట్ గా పక్కకు తప్పించి యంగ్ ప్లేయర్స్ సుందర్, అక్షర్ లకు వరల్డ్ కప్ సమయానికి ఎక్కువ ఛాన్స్ లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇక జడేజా టెస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది. 

అనుభవజ్ఞుడైన జడేజా 204 మ్యాచ్‌ల్లో 231 వికెట్లు పడగొట్టాడు. 2,806 పరుగులు చేసి బ్యాట్ తోనూ సత్తా చాటాడు. 2024 టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచిన తర్వాత జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే, టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. వన్డేల్లో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రాణించాడు. స్పిన్ ఆల్ రౌండర్ గా వన్డే జట్టులో రెగ్యులర్ ప్లేయర్ అనుకుంటే సెలక్టర్లు జడేజాకు ఊహించని షాక్ ఇచ్చారు.